కొందరి గురించి కొన్ని విషయాలు నమ్మశక్యం కావు. అది నిజమే అయినప్పటికీ, ఎక్కడో ఏదో అనుమానం రకరకాల ప్రశ్నలతో మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. ఇప్పుడు విద్యాబాలన్ గురించి ఓ మ్యూజిక్ కంపోజర్ చెబుతున్న నిజం కూడా అలాంటిదే. మరీ అన్ని సార్లు విద్యాబాలన్ తిరస్కరణకు గురై ఉంటుందా అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. కానీ ఆ మ్యూజిక్ కంపోజర్ చెబుతున్నది పచ్చి నిజం.
కేరళలో పుట్టి, ముంబయ్‌లో పుట్టి పెరిగిన విద్యాబాలన్ హీరోయిన్‌గా తనకంటూ సొంత ముద్ర వేసుకున్నారు. ఈమెకు ఎలాంటి సినీబ్యాగ్రౌండ్ లేదు. స్వశక్తితో సినిమాల్లో రాణించేందుకు నానా తంటాలు పడ్డారు. బాలీవుడ్‌లో విద్యాబాలన్ స్టార్‌డమ్ అందు కోవడం వెనుక చాలా శ్రమ, అవమానాలున్నాయి.
హిందీ, బెంగాలీ, మలయాళ చిత్రాల్లో విద్యా నటించి మెప్పించింది. సినీ రంగ ప్రవేశం ఆమెకు నల్లేరుపై నడక కాలేదు. మొట్ట మొదట మ్యూజిక్ వీడియోల్లో, సీరియల్స్‌లో, వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ…ఒక్కో మెట్టు అధిరోహిస్తూ బాలీవుడ్ అనే శిఖరాన్ని చేరుకుంది. బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ మాధురీదీక్షిత్ స్ఫూర్తితో సినీ రంగ ప్రవేశం చేసిన విద్యా…16 ఏళ్ల వయసులో ఏక్తాకపూర్ నిర్మించిన హమ్ పాంచ్ అనే హిందీ సీరియల్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంది.
చీరకట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా విద్యాబాలన్ నిలిచింది. 2005లో వచ్చిన పరిణీత సినిమాలో అవకాశం ఆడిషన్స్‌కు విద్యాబాలన్ వెళ్లింది. ఒకటి కాదు రెండు కాదు…ఏకంగా 75 సార్లు తిరస్కరణకు విద్యా గురైంది. ఈ విషయాన్ని మ్యూజిక్ కంపోజర్ శాంతను మోయిత్రా తెలిపారు. మీరు ఇక్కడేం చేస్తున్నారని తాను ఆమెను ప్రశ్నించానన్నారు. తాను ఆడిషన్స్‌లో పాల్గొనడానికి వచ్చినట్టు విద్యా సమాధానం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
ఒకట్రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యామని వెను తిరిగే వాళ్ల కోసం విద్యాబాలన్ స్ఫూర్తిదాయక విషయం గురించి చెబుతున్నట్టు మ్యూజిక్ కంపోజర్ తెలిపారు.