లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వుంటారు. ట్రెండింగ్ లో వుంటారు అనిపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన అందరి కన్నా లేటుగా ట్విట్టర్ లో అడుగుపెట్టారు. కానీ చకచకా తన ట్వీట్లతో అందరినీ ఆకట్టుకున్నారు. ట్విట్టర్ లో తనదైన స్టయిల్ లో ట్వీట్ లు వేసారు. మధ్య మధ్యలో ఇండస్ట్రీ విషయాలు, సిఎమ్ లను కలవడాలు, వాళ్లకి కృతజ్ఞతలు చెప్పడం వంటివి షేర్ చేసుకున్నారు.
కానీ ఎంత చకచకా ట్విట్టర్ లో కనిపించారో, అంత చటుక్కున సైలంట్ అయిపోయారు. ఇప్పుడేముంది, ట్వీట్ లు వేయడానికి అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే గతంలో ఆయన వేసిన ట్వీట్ లు అన్నీ స్పేస్ కల్పించుకుని వేసినవే. అభిమానులను అలరించినవే. మరి ఇప్పుడు ఎందుకని సైలంట్ అయిపోయారో? మెగాస్టార్ కే తెలియాలి.
ఇదిలా వుంటే ఇండస్ట్రీ విషయంలో కూడా మెగాస్టార్ ఇప్పుడు మౌనముని అయిపోయారు. కరోనా నేపథ్యంలో చాలా యాక్టివ్ గా ముందుకు కదిలారు. సిసిసి అంటూ సరుకులు ఇచ్చారు. ఆ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని రెండో విడత సరుకులు ఇచ్చారు. ఈలోగా ఇండస్ట్రీ తరపున ఆయన ఇంట్లో మీటింగ్ లు నిర్వహించారు. ఇద్దరు సిఎమ్ లను కలిసారు.
ఈ విషయంలో చాలా విమర్శలు కూడా వచ్చాయి. బాలయ్య లాంటి సీనియర్ హరో విమర్శలు చేసారు. సిఎమ్ లను కలిసినపుడు ఆయన ఓ వర్గాన్ని మాత్రమే వెంటబెట్టుకుని వెళ్లారని వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీని ఎవరైతే గుప్పిట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారో, మళ్లీ వాళ్ళనే చిరంజీవి దగ్గరకు తీస్తున్నారని వార్తలు వచ్చాయి.
మొత్తం మీద ఈ టోటల్ ఎపిసోడ్ లో చిరంజీవి కాస్త కార్నర్ అయినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో కరోనా విజృంభించడంతో, ఇద్దరు సిఎమ్ ల దగ్గరకు వెళ్లి షూటింగ్ ల కోసం అనుమతి కోరడం అన్నది ఓ ప్రహసనంగా మిగిలిపోయింది. దాంతో ఇక చేసేది ఏమీ లేకపోయింది.
ఇలాంటి నేపథ్యంలో గిల్డ్ తన మానాన తను మూడు మీటింగ్ లు, ఆరు డిస్కషన్లు అంటూ తన పని తాను చేసుకుపోతోంది. డైరక్టర్లు మరో పక్క వరుసగా సమావేశాలు పెట్టి, వారూ సైలంట్ అయ్యారు. ఇక చేసేది లేక, కాగల కార్యం కరోనాకు, కాలానికి వదిలేసి మెగాస్టార్ సైలంట్ అయిపోయినట్లు కనిపిస్తోంది.