మెగాస్టార్ చిరంజీవి కోడలు, యంగ్ హీరో రాంచరణ్ భార్య ఉపాసన దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్నది ఏ పిల్లోనో, పిల్లనో కాదు లెండి. నెహ్రూ జూలాజికల్ పార్కులోని ‘రాణి’ అనే ఏనుగును ఏడాది కాలానికి ఆమె దత్తత తీసుకున్నారు. తన పుట్టిన రోజు పురస్కరించుకుని జూపార్కును సందర్శించిన అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన దత్తత విషయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ‘రాణి’ పోషణ కోసం అయ్యే ఖర్చు కోసం రూ.5 లక్షల చెక్‌ను క్యూరేటర్, ఐఎఫ్ఎస్ అధికారి క్షితిజకు ఆమె అంద జేశారు. క్షితిజ మాట్లాడుతూ ఉపాసన సేవా దృక్పథాన్ని కొనియాడారు. అడవి జంతువుల పరిరక్షణలో ఉపాసన చూపుతున్న చొరవ స్ఫూర్తిదాయకమన్నారు.
కరోనా కాలంలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువులను దత్తత తీసుకోవడానికి ఎక్కువ మంది ముందుకు వస్తారని క్షితిజ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కరోనాపై ఉపాసన అనేక అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆమె కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు చైతన్యపరిచే పోస్టింగ్‌లు పెడుతున్న విషయం తెలిసిందే.