ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే హోదాలో కలుస్తానంటున్నారు టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. చాలా కాలం తర్వాత సొంత నియోజకవర్గం హిందూపురంకి వెళ్ళిన బాలకృష్ణ, అక్కడి ప్రభుత్వాసుపత్రికి తన తరఫున 50 లక్షల విలువైన మెడిసిన్స్, కొన్ని పరికరాల్ని అందించారు. హిందూపురం మెడికల్ కాలేజీ విషయమై ముఖ్యమంత్రిని త్వరలో కలుస్తానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
‘ప్రతిపక్షంలో వున్నామని, నియోజకవర్గానికి సంబంధించిన పనులపై సైలెంట్‌గా వుండలేం కదా. ప్రభుత్వాన్ని అడుగుతాం, ప్రశ్నిస్తాం, అవసరమైతే పోరాడుతాం..’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇప్పటికే మెడికల్ కాలేజ్‌కి సంబంధించి సంబంధిత మంత్రితో మాట్లాడినట్లు చెప్పిన బాలకృష్ణ, ‘నేనేంటో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికీ తెలుసు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
‘గడచిన ఏడాది కాలంలో అభివృద్ధి ఏమీ జరగలేదు.. కక్ష సాధింపు తప్ప, రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టడంలేదు. చంద్రబాబు హయాంలో తెలంగాణతో పోటీ పడ్డాం. ఇప్పుడు ఆ పరిస్థితి కన్పించడంలేదు..’ అని బాలయ్య విమర్శించారు. ‘ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరికిన వెంటనే ఆయన్ని కలుస్తాను. గతంలో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాం. కరోనా కారణంగా కుదరలేదు’ అని బాలయ్య చెప్పారు.
అన్నట్టు, వైఎస్ జగన్ ఒకప్పుడు నందమూరి బాలకృష్ణకి వీరాభిమాని. కడప టౌన్ ప్రెసిడెంట్‌గా వైఎస్ జగన్ పేరుతో కూడిన ఒకప్పటి హోర్డింగ్‌ల తాలూకు ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ఆ కారణంగానేనేమో.. బాలయ్యను విమర్శించే క్రమంలో వైసీపీ శ్రేణులు ఒకింత సంయమనం పాటిస్తుండడం చూస్తున్నాం.
అంతా బాగానే వుందిగానీ, వైఎస్ జగన్‌ని బాలయ్య కలిసేందుకు చంద్రబాబు అనుమతిస్తారా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. అసెంబ్లీలో వైసీపీ నేతలు బాలయ్యను కలిస్తేనే, చంద్రబాబు గుస్సా అయిపోతుంటారట. అలాంటిది, బాలయ్య తనంతట తానుగా వైఎస్ జగన్‌ని కలిసేందుకు ప్రయత్నిస్తే.. చంద్రబాబు మోకాలడ్డకుండా వుంటారా.?