యువ ఐఏఎస్ అధికారిణి, మన తెలుగింటి ఆడపడుచు కాట అమ్రపాలికి అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం (పీఎంవో)లో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్ అధికారుల్లో ఆమె ఒకరు కావడం విశేషం. ఈ పదవిలో అమ్రపాలి 2023, అక్టోబర్ 27వ తేదీ వరకు కొనసాగుతారు.
అమ్రపాలితో పాటు పీఎంవోలో పనిచేసే మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేశ్ గిల్దియాల్‌ను నియమించారు.
కాగా అమ్రపాలి విశాఖపట్నంలో 1982, నవంబర్ 4న కాటం వెంకటరెడ్డి, పద్మావతి దంపతులకు జన్మించారు. ఈమె 2010వ బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. రాష్ట్ర విభజన తర్వాత ఈమెను తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా నియమితులైన మొట్ట మొదటి మహిళా కలెక్టర్. యువ డైనమిక్ ఆఫీసర్‌గా పేరొందారు. అంతకు ముందు వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా పనిచేశారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు.
జమ్ముకశ్మీర్‌కు చెందిన సివిల్ సర్వెంట్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులయ్యారు.