ప్రముఖ కన్నడ సినీ నటుడు చిరంజీవి సర్జా గత జూన్ లో ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కన్నడ చిత్రసీమలో యువ నటుడిగా మంచి పేరు ఉంది. పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో హీరోగా నటించాడు. చిరంజీవి సర్జా మరో నటి మేఘనా రాజ్ ను ప్రేమించి.. పెద్దల అంగీకారంతో 2018లో పెళ్లి చేసుకున్నాడు. మేఘన రాజ్ సీమంతం వేడుక ఈ సోమవారం బెంగళూరులో జరిగింది. అయితే.. ఈ వేడుకలో చిరంజీవి సర్జా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.. ఎలాగంటే..
మేఘనా రాజ్ పక్కనే చిరంజీవి సర్జా స్టైలిష్ నిల్చుని ఉన్న కటౌట్ ను ఉంచారు కుటుంబసభ్యులు. దీంతో చిరంజీవి సర్జా అక్కడ ఉన్నట్టే భావించారు. చూపరులకు కూడా చిరంజీవి అక్కడే ఉన్న భావన కలిగింది. ఈ ఫొటోలను మేఘన తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకుంది. ‘ఇక్కడ నాకెంతో ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ వేడుక ఇలాగే జరగాలని కోరుకున్నావు కదా బేబీ. నువ్వనుకున్నట్టే జరిగింది. ఐ లవ్ యూ బేబీ మా’ అంటూ భావోద్వేగమైన పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు కూడా ఈ పోస్ట్ చూసి భావోద్వేగమవుతున్నారు. ‘మీకు అంతా మంచే జరగాలి’, ‘చిరంజీవి మిమ్మల్ని వదిలి వెళ్లలేదు.. మీ పక్కనే ఉన్నారు’, ‘మీరు బాగుండాలి.. బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.