ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారనగానే, మొత్తం 130 కోట్ల మంది భారతీయులు చెవులు రిక్కించి మరీ విన్నారు.. కళ్ళు పెద్దవి చేసుకుని చూశారు. ప్రధాని ప్రసంగం 6 గంటలకు ప్రారంభమయ్యింది.. కాస్సేపటికే ముగిసింది. ఇంతకీ, ప్రధాని జాతిని ఉద్దేశించి ఏం సందేశమిచ్చారు.? దేశ ప్రజలకు ఏం భరోసా ఇచ్చారు.? అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఒకటికి రెండు సార్లు ఆ ప్రసంగాన్ని యూ ట్యూబ్లలో తిరగేసినవారికి, న్యూస్ ఛానళ్ళలో చూసినవారికీ.. ‘కొత్తదనం’ ఏమీ కనిపించలేదు.
గతంలో చెప్పినట్లే మాస్క్ ధరించమన్నారు.. సోషల్ డిస్టెన్సింగ్ పాటించమన్నారు. ‘కరోనా ముప్పు తొలగిపోలేదు..’ అనీ చెప్పారు. ఇవన్నీ పాత విషయాలే. కొత్తగా ఒక్కటంటే ఒక్క విషయమూ దేశ ప్రజలకు ‘ఊరటనిచ్చేలా’ ప్రధాని సందేశంలో లేకపోవడం గమనార్హం. ‘పండగలొస్తున్నాయ్.. ఇంకాస్త అప్రమత్తంగా వుండండి..’ అన్నదొక్కటే కాస్త ‘విలువైన సమాచారం’ ఇందులో.. అనుకుని సరిపెట్టుకోవాలి.
దేశ ప్రజలు నరేంద్ర మోడీ నుంచి చాలా చాలా ఆశిస్తున్నారు. ఎందుకంటే, పెద్దన్న ఆయనే మరి. ప్రధాని చెప్పినట్లు ‘చప్పట్లు’ కొట్టారు.. ప్రధాని కోరిన మేరకు ఇళ్ళల్లో దీపాలు వెలిగించారు. మరి, జనం జీవితాల్లో ‘వెలుగులు’ నిండేదెలా.? ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కదా.! లాక్డౌన్ ప్రకటించి, జనాన్ని ఉద్ధరించేశామని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
ఎందుకంటే, లాక్డౌన్ తర్వాత జనం ఆర్థిక స్థితిగతులు అత్యంత దయనీయంగా తయారయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది. ఈ నేపథ్యంలో మోడీ సందేశంలో ఏవేవో ‘కానుకలు’ వుండొచ్చని దేశ ప్రజానీకం భావించింది. రాజకీయ కార్యకలాపాలు సాగుతున్నాయి.. అన్నీ జరుగుతున్నాయి.. ‘జాగ్రత్తగా వుండండి’ అంటే, వినేదెవరు.? మద్యం షాపుల్ని తెరవడంతో.. అసలు కథ మొదలైంది దేశంలో.. కరోనా విజృంభణకు సంబంధించి. ఇప్పుడు ఏం చేసినా ఉపయోగం లేదు. అధికారిక లెక్కల్లో కరోనా తగ్గిపోయింది.. అదే సమయంలో, కరోనా భయం మాత్రం ఇంకా అలాగే వుండిపోయింది.
‘దేశంలో చాలామందికి ఇప్పటికే కరోనా వచ్చేసింది..’ అని కొన్ని అధికారిక సర్వేలే చెబుతన్నాయంటే.. అధికారిక లెక్కల్లో వాస్తవం వుందని ఎలా అనుకోగలం.? మొత్తమ్మీద, ప్రధాని మోడీ.. ఈసారి సందేశంలో చప్పట్లు కొట్టమనో, దీపాలు వెలిగించమనో.. గుంజీలు తీయమనో కోరలేదు.! ఇక్కడితో ఇలా సంతోషపడాల్సిందంతే.. ఇంతకన్నా చేయగలిగిందేమీ లేదు. కరోనా వచ్చిందో.. అంతే సంగతులు. ఎవడి జాగ్రత్త వాడు తీసుకోవాల్సిందే. పాలకులు చేసేదేం లేదు. కాదు కాదు, పాలకుల్నీ, రాజకీయ వ్యవస్థని కూడా కరోనా మార్చలేకపోయింది.
Share