ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చకున్న కుష్బూ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలను కించ పర్చుతూ మాట్లాడిన వీసీకే పార్టీ నేత తిరుమావళవన్ ను శిక్షించాల్సిందే అంటూ తమిళనాడు వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు నిర్వహించింది. ఆ సందర్బంగా కుష్బూ బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలతో ఆందోళనకు దిగింది. తిరుమావళవన్ వెళ్తున్న కారును అడ్డుకుని అతడిపై దాడికి ప్రయత్నించారు అంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈసీఆర్ రోడ్డులో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈరోడ్డు జిల్లా గౌండంబాడి ప్రాంతంలో నిన్న బీజేపీ మరియు వీసీకే పార్టీల కార్యకర్తల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. దాంతో పరిస్థితి ఉదృక్తంగా మారింది. నేడు మళ్లీ బీజేపీ నాయకులు తిరుమావళవన్ ను అరెస్ట్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరోసారి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాంతో పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో కుష్బూ కూడా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళ సంరక్షణ మరియు వారి మద్దతు కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పాలనలో మహిళలను కించపర్చే విధంగా మాట్లాడటం తప్పు అంటూ కుష్బూ సోషల్ మీడియా ద్వారా తన అరెస్ట్ ను వివరించింది.