సౌత్ ఇండియాలో మీటూ అనగానే ఎక్కువ శాతం నోటి నుండి వచ్చే పేరు చిన్మయి. సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్టు అయిన చిన్మయి ప్రముఖ తమిళ రచయితపై మీటూ ఆరోపణలు చేసింది. ఇంకా తమిళ సినిమా పరిశ్రమకు చెందిన వారిని ఆమె విమర్శలు చేసింది. దాంతో ఆమె డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి కూడా తప్పించబడింది. చాలా వివాదాలను ఎదుర్కొన్న ఆమె ఇప్పటికి కూడా తన పంథా మార్చుకోకుండా తాను అనుకున్న విషయాలను సోషల్ మీడియా ద్వారా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తాజాగా ఈమె లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం మణిరత్నం నవరస అనే భారీ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నాడు. జయేంద్రతో కలిసి మరణిరత్నం ఈ వెబ్ సిరీస్ ను 9 ఎపిసోడ్ లుగా నిర్మిస్తున్నాడు. ఈ 9 ఎపిసోడ్ లకు తాను కాకుండా 9 మంది దర్శకులు దర్శకత్వం వహించబోతున్నారు. 8 మంది సంగీత దర్శకులు 9 మంది సినిమాటోగ్రాఫర్లు 20 మంది టాప్ స్టార్స్ ఈ వెబ్ సిరీస్ కోసం పని చేస్తున్నారు. వీరంతా కూడా పారితోషికం తీసుకోకుండానే పని చేసేందుకు ముందుకు వచ్చారు అనేది తమిళ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
ఈ సినిమాకు మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న సింగర్ కార్తిక్ కూడా ఉన్నాడు. ఈ వెబ్ సిరీస్ లో కార్తిక్ ఉండటంపై చిన్మయి స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి అవకాశం ఇచ్చిన మీరు బాధితురాలిని అయిన నన్ను ఎందుకు పక్కకు పెట్టారు అంటూ సూటిగా ప్రశ్నించింది. వేదించిన వారికి పని కల్పించి బాధితురాలికి పని లేకుండా చేయడం ఎంత వరకు సమంజసం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అండగా ఉంటున్న మీరు ఎందుకు బాధితురాలి పట్ల మాత్రం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.