గ్రేటర్ ఎన్నికల్లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ప్రచారం హాట్ టాపిక్‌గా మారుతోంది. అత్యంత వ్యూహాత్మకంగా తేజస్వి సూర్యని బీజేపీ అగ్రనాయకత్వం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం దించింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సాగుతోంది తేజస్వి సూర్య గ్రేటర్ ఎన్నికల ప్రచారం. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.. కన్నడ సంఘాలతో భేటీ అయ్యారు.. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు.. ఈ క్రమంలో ఎక్కడికక్కడ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలతో చెలరేగిపోతున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళే క్రమంలో తేజస్వి సూర్య ఒకింత హైడ్రామా క్రియేట్ చేశారు. తనను పోలీసులు అడ్డుకున్నారంటూ తేజస్వి సూర్య ఆగ్రహం వ్యక్తం చేయడంతో, బీజేపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు బీజేపీ కార్యకర్తలు. అయితే, తాము తేజస్వి సూర్య పర్యటనను అడ్డుకోలేదని పోలీసులు చెబుతుండడం గమనార్హం.
మరోపక్క ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన తేజస్వి సూర్య, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు (పదవులు) వచ్చాయి’ అంటూ ఎద్దేవా చేశారు. ‘కేసీరావు, కేటీరావు (కేసీఆర్, కేటీఆర్).. ప్రజలకు ఏవీ రావు..’ అంటూ తేజస్వి మాటల తూటాలు పేల్చారు. ‘గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ దెబ్బ ఏంటో టీఆర్‌ఎస్‌కి రుచి చూపించాలి..’ అంటూ నినదించారు తేజస్వి సూర్య.
తేజస్వి రాకతో ఉస్మానియా యూనివర్సిటీలో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదే సమయంలో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. తేజస్వి సూర్య ప్రచారం ఎఫెక్ట్ ఎలా వుంటుందో ముందే ఊహించిన టీఆర్‌ఎస్, ఆయనకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘బూతుల్ని’ ట్రెండింగ్‌లో వుంచిన విషయం విదితమే. అయితే, దానికి కౌంటర్‌గా బీజేపీ కూడా, గట్టిగానే సమాధానమిచ్చిందనుకోండి.. అది వేరే విషయం. ప్రధానంగా యువతని తేజస్వి సూర్య ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయి. అయితే, అవి ఓట్లను రాల్చుతాయా.? లేదా.? అన్నది మాత్రం ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.