నష్టాల్లో వున్న ప్రభుత్వ సంస్థల్ని అమ్మేయడం తప్ప ఇంకో మార్గమే లేదని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చేశారు. అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వం తరఫున సాయం అందించడమంటే, పన్నులు కడుతోన్న ప్రజల్ని మోసం చేయడమేనన్నది నరేంద్ర మోడీ ఉవాచ. వావ్.. ఈ లాజిక్ అదిరిపోయింది.
అసలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఎందుకు నష్టాలు వస్తున్నాయి.? ప్రైవేటు రంగ సంస్థలు ఎందుకు దూసుకుపోతున్నాయి.? అన్న చర్చ జరగకుండా, నష్టాలు వస్తున్నాయి కాబట్టి.. అమ్మేస్తామంటే ఎలా.? సొంతంగా గనులు లేకపోవడం అనేది విశాఖ స్టీలు ప్లాంటు తప్పు కాదు.. అది ప్రభుత్వాల వైఫల్యం. మరి, ప్రభుత్వాల వైఫల్యానికి ఎలాంటి శిక్ష వేయాలి. ప్రభుత్వాల్ని అమ్మేయడం కుదరదు కాబట్టి.. ఊరుకున్నారుగానీ.. లేకపోతే ఆ పనీ చేసేస్తారేమో.
అమ్మేసుకుంటూ పోతే, ప్రభుత్వాల దగ్గర మిగిలేదేముంటుంది.? కొన్ని విభాగాల్లో కనిష్ట స్థాయిలో ప్రభుత్వ పెట్టుబడులుంటాయి తప్ప.. పూర్తిగా వుండడం సాధ్యమయ్యే పనే కాదని ప్రధాని నరేంద్ర మోడీ కుండబద్దలుగొట్టేసిన వైనం చూస్తోంటే, బీజేపీ తాజా టెర్మ్ కేంద్రంలో ముగిసేసరికి, దేశంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వ రంగ సంస్థ వుండదేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో ప్రభుత్వాలు తలుపుల్ని బార్లా తెరిచేశాయి భారతదేశంలోకి. దాంతో, చాలావరకు ప్రముఖ దేశీయ సంస్థలు ప్రస్తుతం విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయాయి.
ఈ క్రమంలో విదేశీ పెత్తనం అన్ని విషయాల్లోనూ పెరిగిపోవడం ఖాయం. విద్య, వైద్యం సహా అన్ని రంగాలూ ఇప్పుడు సామాన్యుడికి అత్యంత ఖరీదైన వ్యవహారాలుగా మారిపోయాయి. సగటు భారతీయుడు జీవించడమే గగనంగా తయారవుతోంది ఈ ప్రైవేటు పెత్తనం కారణంగా. అయినాగానీ, ప్రైవేటు ముద్దు.. ప్రభుత్వ సంస్థల్ని కాపాడుకోవాలన్న ఆలోచన వద్దే వద్దు.. అంటోంది కేంద్రం.
మొత్తమ్మీద, విశాఖ ఉక్కు పరిశ్రమ విషయమై మబ్బులు తొలగిపోయాయ్.. మిగిలి వున్న ఆ కొన్ని ఆశలు కూడా చచ్చిపోయాయ్.. రాజకీయ నాయకులు పిల్లిమొగ్గలు వేసినా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగదు గాక ఆగదు. ఇంకా బీజేపీ జెండా పట్టుకుని నాయకులు రాష్ట్రంలో తిరిగితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.