పుష్ప డ్యూయాలజీలో తొలి భాగం పుష్ప -1 చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని దసరా బరిలో రిలీజ్ చేయాలని పట్టుదలగా పని చేస్తున్నట్టు సమాచారం. ఇక డ్యూయాలజీలో రెండో భాగం కొంత గ్యాప్ తర్వాత తెరకెక్కుతుంది. ఈలోగా సుకుమార్ వేరొక సినిమాని పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇక బన్ని ఈ రెండు భాగాల చిత్రంలో మాస్ అవతార్ తో అభిమానులకు అదిరిపోయే ట్రీటివ్వబోతున్నాడు. గంధపు చక్కల స్మగ్లర్ గా నెగెటివ్ రోల్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే అతడి లుక్ పై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గుబురు గడ్డం.. జులపాల జుత్తుతో మాసీగా కనిపిస్తున్న బన్ని యాక్షన్ ని పీక్స్ కి తీసుకెళుతున్నాడని ఇంతకుముందు రిలీజైన టీజర్ వెల్లడించింది.
అడవుల నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ పుష్ప కోసం పూర్తి గ్రామీణ భారతానికి వెళ్లి ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. బన్ని తన పాత్ర స్పెసిఫికేషన్ లకు తగినట్లుగా మేకోవర్ చేయించుకున్నాడు. తాజాగా లీకైన ఓ ఫోటోలో అల్లు అర్జున్ లుక్ పై మరింత స్పష్ఠత వచ్చింది. ఈ ఫోటోలో పొడవాటి గజిబిజి జుట్టు గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. అతను క్రూరుడైన స్మగ్లర్ గా తెరపై కనిపిస్తాడు. అల్లు అర్జున్ తన గెటప్ కోసం మేకప్ రూమ్ లో రోజుకు 2 గంటలకు పైగా గడుపుతున్నారని సమాచారం. పుష్ప అతని తొలి పాన్-ఇండియా చిత్రం. ఈ సినిమా దసరా టార్గెట్ మిస్సయితేనే క్రిస్మస్ కి వస్తుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో రష్మిక మందన విలేజీ అమ్మాయిగా నటిస్తుండగా అనసూయ పాత్ర బిగ్ సర్ ప్రైజ్ ఇస్తుందని చెబుతున్నారు. దిశా పటానీ కానీ కత్రిన కానీ ఇందులో ఐటమ్ నంబర్ లో నర్తించే వీలుందని తెలుస్తోంది. దేవీశ్రీ ఇప్పటికే బాణీలను సిద్ధం చేస్తున్నారు.