టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఈరోజు గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు. నాగార్జునతో పాటు సినీ నిర్మాత ప్రీతమ్ రెడ్డి – నిరంజన్ రెడ్డి సహా మరికొందరు సినీ ప్రముఖులు ప్రత్యేక విమానంలో వచ్చి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిశారు. ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిని నాగ్ కలవడం ఆసక్తికరంగా మారింది.
నాగార్జున – జగన్మోహన్ రెడ్డి మధ్య ఎప్పటి నుంచో మంచి సాన్నిహిత్యం ఉందనే సంగతి తెలిసిందే. ఈరోజు భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్ తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం కూడా చేశారని సమాచారం. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై జగన్ తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన కొన్ని కీలక పరిణామాలు – ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ వంటి అంశాలు చర్చకు వచ్చాయని వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే ఏపీలో నాలుగు షో లకు పర్మిషన్ ఇవ్వడంతో పాటుగా వంద శాతం థియేటర్ ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చినందుకు జగన్ కు నాగార్జున బృందం కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం. ఈ భేటీలో ఏపీ సీఎం మరియు నాగార్జున బృందం మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి? ఈ సమావేశం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఇద్దరూ మర్యాదపూర్వకంగానే కలిసారా? అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.