Advertisement

‘పుష్ప’ ను ‘కేజీయఫ్’ తో పోల్చడంపై సుకుమార్ ఏమన్నారంటే..?

Posted : December 20, 2021 at 12:28 pm IST by ManaTeluguMovies

‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”పుష్ప: ది రైజ్”. అల్లు అర్జున్ – రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా.. రివ్యూస్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే మొదటి నుంచీ ఈ చిత్రాన్ని ‘కేజీయఫ్’ తో పోల్చడం ప్రతికూలంగా మారిందనే కామెంట్స్ వచ్చాయి. దీనిపై దర్శకుడు సుకుమార్ స్పందిస్తూ.. ఆ రెండు సినిమాలకు పోలిక పెట్టడం సరికాదని అన్నారు.

‘కేజీయఫ్’ సినిమాతో ‘పుష్ప’ సినిమాను పోల్చడానికి ఒక కారణం రెండు భాగాలుగా చేయడమైతే.. మరొకటి థీమ్ ఒకే విధంగా ఉండటం. అక్కడ కోలార్ గోల్డ్ ఫీల్డ్ మైనింగ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకుంటే.. ఇక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యాన్ని తీసుకుని తెరకెక్కించారు.

అందులోనూ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు గతంలో ‘ఒక పుష్ప 10 కేజీయఫ్ లతో సమానం’ అనే కామెంట్స్ చేసి హైప్ తీసుకొచ్చారు. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ‘పుష్ప’ పార్ట్-1 మూవీ ‘కేజీయఫ్-1’ స్థాయిలో లేదని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో సుకుమార్ మాట్లాడుతూ.. ‘కేజీయఫ్’ తో ‘పుష్ప’ సినిమాని పోలుస్తున్నారు. దేని ప్రత్యేక దానిదే. దీనిపై బుచ్చిబాబుతో మాట్లాడా. ఆ సినిమా బ్యాక్ డ్రాప్ – విజువల్స్ వేరు. ఇది ఎమోషనల్ బ్యాక్ డ్రాప్.

కొత్త ఫార్మాట్ లో ఉన్న కమర్షియల్ సినిమా. దేనితోనూ దీన్ని పోల్చకూడదు. సెకండ్ పార్ట్ కనెక్షన్స్ కోసం ఉంచిన కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అయినట్టు అనిపించొచ్చు. కానీ అది కొంతవరకే. మిగతాదంతా గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ”బన్నీని ఇలాంటి పవర్ ఫుల్ యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ లో చూపిద్దామని చాలా ఏళ్ల క్రితమే అనుకున్నాను. అది ఇప్పటికి కుదిరింది. ఏ బ్యాక్ డ్రాప్ తీసుకుందామా అని బాగా ఆలోచించి ఎర్ర చందనం స్మగ్లింగ్ తీసుకున్నాను.

వేరే ఏదైనా తీసుకోవచ్చు కానీ ఇదైతే సౌత్ లో అందరికీ తెలుసు కాబట్టి బాగా కనెక్టవుతారని ఫీలయ్యాను. దీనిపై సుమారు ఆరు నెలలు రీసెర్చ్ చేశా. నిజానికి మొదట వెబ్ సిరీస్ తీద్దామనుకున్నాను కానీ.. చివరకు సినిమా అయితేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాను” అని తెలిపారు.

”సినిమాలో బన్నీకి కచ్చితంగా ఏదోక మేనరిజం ఉండాలని ‘తగ్గేదే లే’ అనేది పెట్టాం. బాడీ లాంగ్వేజ్ తో పాటు డైలాగ్స్ ఉంటే త్వరగా కనెక్టవుతాయి. ఇందులో చాలా సీన్స్ నిజంగా జరిగినవే. క్యారెక్టర్స్ కూడా రియల్ లైఫ్ లో ఎవరో ఒకర్ని చూసి ఇన్స్పైర్ అయి రాసుకున్నవే. బన్నీ డెడికేషన్ అద్భుతం. చిత్తూరు స్లాంగ్ కోసం చాలా కష్టపడ్డాడు.

కొన్ని పాత్రలు కొందరు చేస్తేనే సూటవుతాయి. అలాంటి వారిలో రావు రమేష్ – సునీల్ ఉంటారు. పుష్పలో ఇద్దరి పాత్రలూ బాగా కుదిరాయి” అని సుకుమార్ చెప్పారు.

”పుష్ప చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయడానికి రాజమౌళి ఎంకరేజ్ మెంటే కారణం. ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా నార్త్ లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నిజానికి మాకు సమయం లేకపోవడం వల్లే సరైన పబ్లిసిటీ చేయలేకపోయాం. అన్ని విషయాల్లోనూ ప్రొడ్యూసర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. సెకండ్ పార్ట్ అంతా డాన్ పుష్పరాజ్ గురించి కాదు.. రెడ్ శాండిల్ గురించే ఉంటుంది”

”మెయిన్ స్టోరీ అంతా ‘పుష్ప-2’ లోనే ఉంటుంది. పార్ట్-1 లో పాత్రలను మాత్రమే పరిచయం చేశాం. ఇవే క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతాయి. ఎమోషనల్ సన్నివేశాలూ ఎక్కువే. ఫాదర్ – బ్రదర్స్ మధ్య బాండింగ్ లాంటివన్నీ చూపించి కన్క్లూజన్ ఇస్తాం.

రెండో భాగాన్ని వచ్చే దసరాకి విడుదల చేయాలని అనుకుంటున్నాం. లేదంటే మళ్లీ డిసెంబర్ లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తాం” అని సుకుమార్ చెప్పుకొచ్చారు.

కాగా ‘పుష్ప’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని – వై రవిశంకర్ నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందించారు. రెండో భాగాన్ని ”పుష్ప: ది రూల్” పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫిబ్రవరి – మార్చి నెలల్లో సెకండ్ పార్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందని మేకర్స్ వెల్లడించారు.


Advertisement

Recent Random Post:

Supreme Court verdict on EVMs | ఈవీఎంలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

Posted : November 26, 2024 at 10:45 pm IST by ManaTeluguMovies

Supreme Court verdict on EVMs | ఈవీఎంలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad