Advertisement

కష్టాన్ని ఇష్టపడేవారికి రవితేజ ఆదర్శమే!

Posted : January 26, 2022 at 4:07 pm IST by ManaTeluguMovies

రవితేజ అంటే జోష్ .. రవితేజ అంటే ఎనర్జీ .. రవితేజ అంటే మాస్ మహారాజ్. తెలుగు తెరపై చాలామంది హీరోలు తమదైన ముద్రవేశారు .. తమదైన సంతకం చేశారు. అలాంటి హీరోలందరి జాబితాలోను మాస్ కంటెంట్ ఉన్న సినిమాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ రవితేజకి మాత్రమే మాస్ మహారాజ్ అనే బిరుదు దక్కింది. దాని వెనుక ఆయన కసి .. కృషి .. అంకితభావం .. పరిగెత్తాలనే పట్టుదల ఉన్నాయి. ముందుగా కెమెరా వెనుక పనిచేస్తూ .. అవకాశాన్ని బట్టి చిన్న చిన్న పాత్రలను చేస్తూ తాము అనుకున్నది సాధించినవారిగా రేలంగి .. ఎల్వీ ప్రసాద్ వంటివారు కనిపిస్తారు. అదే బాటలో రవితేజ అడుగులు వేయడం విశేషం.

చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ .. జగపతిబాబు వంటి స్టార్ హీరోలు బరిలో ఉండగా ఎలాంటి నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టడం ఒక సాహసమైతే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం మరో విశేషం. పిట్టపిల్ల సముద్రాన్ని చూసి భయపడితే దానిపై ఎగరలేదు. అలాగే ఎలాంటి జంకు లేకుండా రవితేజ చేసిన ప్రయత్నాలు .. ప్రయోగాలే ఆయనను ఒక్కోమెట్టు పైకెక్కిస్తూ వెళ్లాయి. 1968 జనవరి 26వ తేదీన ‘జగ్గంపేట’లో జన్మించిన రవితేజ ఆ తరువాత కాలంలో సినిమాలపై ఆసక్తిని పెంచుకుని ఆ దిశగా అడుగులు వేశాడు.

1990లో ‘కర్తవ్యం’ సినిమాలో ఒక చిన్న పాత్రను చేసిన ఆయన ఆ తరువాత కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే ‘నిన్నే పెళ్లాడుతా’ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ వెళ్లాడు. రవితేజలోని ఈజ్ .. ఆయన ఎనర్జీని చూసిన కృష్ణవంశీ ‘సిందూరం’ సినిమాలో సెకండ్ హీరోగా ఛాన్స్ ఇచ్చారు. ‘నీ కోసం’ సినిమాతో ఆయనను సోలో హీరోగా శ్రీను వైట్ల తెరపైకి తీసుకుని వచ్చాడు. ఇక అప్పటి నుంచి రవితేజ వెనుదిరిగి చూసుకోలేదు. ‘ఇటు శ్రావణి సుబ్రమణ్యం’ .. ‘ఇడియట్’ .. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలతో ఆయనకి పూరి స్టార్ డమ్ తీసుకొచ్చాడు.

రవితేజ చాలా హిట్లు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆయన కెరియర్లో కీలకమైన పాత్రలను పోషించిన దర్శకులుగా కృష్ణవంశీ .. శ్రీను వైట్ల .. పూరి జగన్నాథ్ కనిపిస్తారు. తనదైన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ .. స్పీడ్ గా .. అర్థమయ్యేలా డైలాగ్స్ చెప్పేతీరు .. యాక్షన్ .. రొమాన్స్ .. కామెడీలో రవితేజ స్టైల్ ప్రేక్షకులకు బాగా పట్టేసింది. తెరపై తాను ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ .. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేయగలగడం రవితేజ ప్రత్యేకత. ఇక రవితేజ తన పని గురించి తప్ప మరే విషయాలను పట్టించుకోడు. సమయాన్ని వృథా చేసే అలవాటు లేకపోవడం వల్లనే ఆయన ఇంత తక్కువ సమయంలో ఇన్ని సినిమాలు చేయగలిగాడు. పనిని ఒక తపస్సుగా భావించడం వల్లనే ఇన్ని విజయాలను సాధించగలిగాడని చెప్పచ్చు.

ఇప్పుడు కూడా ఆయన చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. రమేశ్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘ఖిలాడి’ వచ్చేనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ని ఆయన ముగింపు దశకి తీసుకొచ్చాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలోని ‘ధమాకా’ సినిమాను కూడా మొదలెట్టేశాడు. ఈ నెల 14వ తేదీనే ‘రావణాసుర’ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేయించాడు. త్వరలోనే ‘టైగర్ నాగేశ్వరావు’ను పట్టాలెక్కించనున్నాడు. రవితేజ దూకుడికి నిదర్శనంగా నిలబెట్టడానికి ఈ జాబితా సరిపోతుందేమో. కష్టాన్ని ఇష్టపడే కొత్త హీరోలకి ఆయన ఆదర్శమేనని చెప్పాలి. ఈ రోజున ఆయన బర్త్ డే .. ఈ సందర్భంగా మాస్ మహారాజ్ కి శుభాకాంక్షలు చెప్పేద్దాం!


Advertisement

Recent Random Post:

Bigg Boss Telugu 8 – Day 79 Promo 2 | Kirrak Seetha & Naga Manikanta Shake things up 🔥

Posted : November 19, 2024 at 2:04 pm IST by ManaTeluguMovies

Bigg Boss Telugu 8 – Day 79 Promo 2 | Kirrak Seetha & Naga Manikanta Shake things up 🔥

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad