తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ‘సమతామూర్తి’ దర్శనానికి వెళ్ళలేకపోయారు.. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోన్న మేడారం జాతరకీ వెళ్ళలేకపోయారు. అసలేమవుతోంది తెలంగాణలో.?
కేసీయార్కి అత్యంత సన్నిహితుడైన మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు అలాగే, మరో సన్నిహితుడు చినజీయర్ స్వామీజీ సంయుక్తంగా నిర్మించిన ‘సమతాస్ఫూర్తి’ ఆధ్మాత్మిక కేంద్రానికి సంబంధించి కీలకమైన ఏర్పాట్లను ఆయనే స్వయంగా గతంలో పర్యవేక్షించారు.. అవసరమైన వసతుల్ని ప్రభుత్వం పరంగా సమకూర్చారు.. అంతేనా, పార్టీ ముఖ్య నేతలతో పెద్దయెత్తున విరాళాలు కూడా ఇప్పించారు.
అయితే, ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ సమతా కేంద్రాన్ని సందర్శించినా, కేసీయార్ ఇప్పటిదాకా అటువైపు దృష్టి సారించలేదు. తెలంగాణకు ఇదొక ల్యాండ్ మార్క్.. అని ఆ మధ్య ప్రకటించిన కేసీయార్, ఆ ల్యాండ్ మార్క్ విషయంలో ఎందుకు కినుక వహించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా వుంది.
‘కేసీయార్తో విభేదాల్లేవు..’ అంటూ చినజీయర్ స్వామీజీ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. సమతా మూర్తి వ్యవహారాన్ని పక్కన పెడదాం. మేడారం మాటేమిటి.? ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా మేడారం జాతర గురించి చెప్పుకుంటుంటాం. అలాంటి ప్రతిష్టాత్మకమైన జాతరకు కేసీయార్ వెళ్ళకపోవడం ఆశ్చర్యకరం.
మేడారం జాతరకు కేసీయార్ వెళ్ళకపోవడంపై తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. నిజానికి, నిన్ననే ఆయన మేడారం వెళ్ళాల్సి వుంది. సాయంత్రం వరకూ హంగామా నడిచి, చివరకు తుస్సుమనిపించేశారు.
‘కేసీయార్ ప్రధాని కావాలని కోరుకున్నాం..’ అంటూ మేడారం జాతరకు వెళ్ళిన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, అందునా మంత్రులు ఊకదంపుడు ప్రసంగాలెలా వున్నా, అటువైపుగా కేసీయార్ చల్లని చూపు లేకపోవడం పట్ల ఖచ్చితంగా వనదేవతలు ఆగ్రహం వ్యక్తం చేస్తారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.