Advertisement

‘భీమ్లానాయక్’ సాక్షిగా తెలుగు సినిమాపై ‘తెలంగాణ ప్రేమ’ని చాటిన కేటీయార్.!

Posted : February 24, 2022 at 11:38 am IST by ManaTeluguMovies

‘గోదావరి నది నుంచి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తీసుకొచ్చి, తెలంగాణ నేలని సస్యశ్యామలం చేస్తున్నాం. గోదావరి నదీ తీరాన కనిపించే ప్రకృతి అందాలు ఇప్పుడు తెలంగాణలోనూ ఆవిష్కృతమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో తెలుగు సినిమాల షూటింగులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా..’ అంటూ తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ‘భీమ్లానాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాక్షిగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి విజ్ఞప్తి చేశారు.

ఓ వైపు, తెలుగు సినిమాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతోంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం, తెలుగు సినీ పరిశ్రమకు చేతనైనంత సాయం చేసే దిశగా ముందడుగు వేస్తోంది. అంతేనా, ‘మీకు ఏ సమస్య వున్నా మాతో చెప్పండి.. పరిష్కరిస్తాం..’ అంటోంది. మంత్రులు కేటీయార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే టీఆర్ఎస్ నేతలు దానం నాగేందర్, మాగంటి గోపి.. తదితరులు ‘భీమ్లానాయక్’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో సందడి చేశారు.

‘మీ నాయకుడు’ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులతో పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించిన కేటీయార్, ‘పవన్ కళ్యాణ్ సోదరుడిగా మాట్లాడుతున్నా..’ అని చెప్పడం గమనార్హం. పవన్ కళ్యాణ్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అనీ, మనస్ఫూర్తిగా ఈ మాట చెబుతున్నానని అన్నారు కేటీయార్. అంతేనా, ‘మేం కూడా మీ ఖుషీ సినిమా చూసి అభిమానులుగా మారిన వాళ్ళమే..’ అని కేటీయార్ అన్నారు.

సరే, సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో వక్తలు మాట్లాడే మాటలు ఇలాగే వుంటాయా.? అంటే, అది వేరే చర్చ. పవన్ కళ్యాణ్, మారుమూల ప్రాంతాల్లో వున్న టాలెంటెడ్ వ్యక్తుల్ని ప్రోత్సహించే తీరునీ కేటీయార్ ప్రత్యేకంగా అభినందించారు. పొగిడించుకుంటే వచ్చే పొగడ్తలు కావివి. అందుకేనేమో, కేటీయార్ అంతగా హృదయాంతరాల్లోంచి పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు గుప్పించడాన్ని అటు బులుగు మీడియా, ఇటు పచ్చ మీడియా జీర్ణించుకోలేకపోతున్నాయి.

ఇంకోపక్క, ‘భీమ్లానాయక్’ సినిమా విషయమై ఏపీలోని అధికార వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. థియేటర్లకు నోటీసులు పంపడం దగ్గర్నుంచి.. నానా యాగీ షురూ అయిపోయింది ఆంధ్రప్రదేశ్‌లో. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం, ‘మనల్ని ఎవడ్రా ఆపేది..’ అంటూ ‘భీమ్లానాయక్’ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇండియన్ సినిమాకి హైద్రాబాద్‌ని కేరాఫ్ అడ్రస్‌గా మలచే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోందనీ, తెలుగు సినీ పరిశ్రమ కూడా ప్రభుత్వానికి సహకరించాలని కేటీయార్, పవన్ కళ్యాణ్‌ని విజ్ఞప్తి చేయడం కొసమెరుపు.


Advertisement

Recent Random Post:

Bigg Boss Telugu 8 | Day 80 – Promo 1 | ‘Save the T-shirt’ Challenge 💥| Nagarjuna

Posted : November 20, 2024 at 7:25 pm IST by ManaTeluguMovies

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad