2024 ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ పోత్తులు..కూటములు అంటూ ప్రణాళికలు..వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే జనసేన బీజేపీతో కలిసి ప్రయాణం సాగిస్తుంది. ఇటీవల మీడియా మీట్ లో జనసేన టీడీపీతోనూ కలిసి ప్రయాణం చేసే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటల్ని బట్టి అర్ధమవుతుంది. మరి పవన్ సింగిల్ గా వస్తారా? పొత్తులతో బరిలోకి దిగుతారా? అన్నది ప్రస్తుతానికి సశేషమే. రాజకీయాల సంగతి పక్కనబెట్టి..రాజకీయం సినిమా కలిపి మాట్లాడితే అందులోకి కచ్చితంగా మెగాఫ్యామిలీ వస్తుంది.
జనసేన వెంట మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది సభ్యులున్నారు? అన్నది క్లారిటీ లేదు. అటు మెగాస్టార్ చిరంజీవి పీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలుగుతారు. ఇటీవలే పరిశ్రమ-ప్రభుత్వం మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకి చిరంజీవి ఎంట్రీతో పరిష్కారం దొరికింది. అలాగని చిరంజీవి వైకాపా మద్దతుదారుడా? అంటే అవునని అనలేం.
సినిమా వేదికలపై తమ్ముడు పవన్ కళ్యాణ్ కి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయంటారు. ఆ లెక్కలో చూస్తే చిరంజీవి జనసేన మధ్దతుదారుడుగానే భావించాలి. సీఎం తో సాన్నిహిత్యం చూస్తే వైకాపా వెంటా? అని మరో సందేహం వెంటాడుతుంది. ఇది క్లారిటీ లేని అంశమే. ఇక మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ఈ విషయంలో కుండబద్దులు కొట్టినట్లే వ్యవహరిస్తారు.
తమ్ముడు వెంటే తను ఉన్నానని పబ్లిక్ గానే చాలాసార్లు చెప్పారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా టైమ్ వచ్చినప్పుడల్లా బాబాయ్ తోనే అని అంటుంటారు. తాజాగా అదే మాట మరోసారి చెప్పాల్సి వచ్చింది. ఇటీవలే తన 15వ చిత్రం షూటింగ్ లో భాగంగా చరణ్ వైజాగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ మెగా అభిమానులు..జనసైనుకులు చరణ్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. చరణ్ ఎంతో ఓపికగా వాళ్లకి ఫోటోలు కూడా ఇచ్చారు.
అయితే కొంతమంది జనసైనులు మాత్రం చరణ్ ని వ్యక్తిగతంగా కలిసి చరణ్ తో `జై జనసేన` అనిపించారు. ఇప్పుడు..ఎప్పుడు..ఎప్పటికీ జనసేన పార్టీకే సపోర్ట్ ఉంటుందని ఉద్ఘాటించారు. ఇదే సమయంలో ఒకింత సైనుకులపై చరణ్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కనిపిస్తుంది. తాను జనసేన అన్న విషయాన్ని పదే పదే చెప్పాల్సిన పనిలేదని..ఈ విషయాన్ని అభిమానులంతా అర్ధం చేసుకోవాలని విజ్ఙప్తి చేసారు. చరణ్ జై కొట్టడంతో జనసైనుకుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది.
చరణ్ అన్న మన వెంటే ఉన్నాడని సంబర పడ్డారు. సినిమా వేరు -రాజకీయం వేరని పరిశ్రమ సహా మెగా ఫ్యామిలీ భావిస్తుంది. రెండిటిని ముడిపెట్టి చూడొద్దని..మాట్లాడవద్దని చాలాసార్లు ప్రముఖలు హెచ్చరించారు. కానీ అది హెచ్చరికగానేమిగిలిపోతుంది.