Advertisement

ఆ తరం హీరో అర్జున్ Vs ఈ తరం హీరో విశ్వక్..!

Posted : November 8, 2022 at 9:47 pm IST by ManaTeluguMovies

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మరియు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మూడు నెలల క్రితం అర్జున్ దర్శక నిర్మాణంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ మరియు విశ్వక్ జోడీగా ప్రారంభమైన ఓ సినిమా విషయంలో ఈ కాంట్రవర్సీ చెలరేగింది. దర్శక హీరోల మధ్య అభిప్రాయాలు భేదాలు రావడంతో.. చివరకు అది వివాదంగా మారింది.

అర్జున్ సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నాడని వార్తలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో.. డైరెక్టర్ అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి దీనిపై వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. విశ్వక్ ఈ సినిమా విషయంలో తనని తన టీమ్ మొత్తాన్ని అవమానించాడని ఆరోపించారు. అతని కారణంగా రెండు సార్లు షెడ్యూల్ వాయిదా వేసుకున్నామని.. తీరా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉదయం షూటింగ్ అనుకుంటుండగా.. తెల్లారుజామున క్యాన్సిల్ చేయమని మెసేజ్ పెట్టాడని చెప్పారు. అది తాను జీర్ణించుకోలేకపోయానని.. విశ్వక్ కు కమిట్ మెంట్ లేదని.. మరీ ఇంతా అన్ ప్రొఫెషనలిజమా అని అర్జున్ వ్యాఖ్యానించారు.

42 ఏళ్ళ కెరీర్ లో ఇప్పటి వరకూ ఒకరి మీద కూడా ఇలా ఆరోపణలు చేయలేదని.. ఇప్పుడు కూడా తన బాధ చెప్పుకోడానికి మాత్రమే వచ్చానని.. మరొకరికి ఇలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలనే మీడియా ముందుకు వచ్చానని అర్జున్ చెప్పారు. ఒక మంచి సినిమా తీస్తా అని చెప్పా.. హీరోగా అతడు కొన్ని సూచనలు చేయొచ్చు తప్పులేదు కానీ.. ఒక మేకర్ గా తనకు కూడా అవి నచ్చాలి కదా అన్నారు.

ఇదే విషయం మీద హీరో విశ్వక్ సేన్ కూడా స్పందించాడు. తాను నటించే సినిమాకు సంబంధించిన అన్ని పనులు చూసుకుంటానని.. తనంత కమిటెడ్ – ప్రొఫెషనల్ నటుడు ఉండడని అన్నారు. తన వల్ల ఇప్పటివరకు ఏ నిర్మాత బాధపడలేదని. సెట్ లోని ఒక్క లైట్ బాయ్ అయినా నన్ను కమిటెడ్ ప్రొఫెషనల్ యాక్టర్ కాదంటే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానని వ్యాఖ్యానించారు. కళ్లు మూసుకుని కాపురం చెయ్ అంటే షూట్ కి బయలుదేరే ముందు భయమేసిందని.. అందుకే ఆ ఒక్క రోజు షూట్ క్యాన్సిల్ చేసి కొన్ని విషయాలపై డిస్కస్ చేద్దామని మెసేజ్ పెట్టినట్లుగా విశ్వక్ చెప్పుకొచ్చారు.

ఈ విషయంలో తమ్మారెడ్డి భరద్వాజ లాంటి పలువురు సినీ ప్రముఖులు సైతం విశ్వక్ సేన్ ను తప్పుబట్టారు. సినిమా ఒప్పుకోక ముందు ఎన్నైనా డిస్కస్ చేయచ్చు కానీ.. ఒక్కసారి సినిమా ఒప్పుకున్న తర్వాత మార్పులు చెప్పడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. విశ్వక్ చేసిన పని అర్జున్ కి మాత్రమే కాదు.. నిర్మాత అనే ప్రతి ఒక్కరికీ.. దర్శకుడు అనే ప్రతి ఒక్కరికీ కూడా అవమానమేనని కీలక వ్యాఖ్యలు చేసారు.

ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన కుర్రాళ్లందరూ ప్రతీ దాంట్లోనూ కాలు వేలు పెట్టేసి సక్సెస్ అనుకుంటున్నారని.. హీరోలు ప్రతి విషయంలోను జోక్యం చేసుకోవడం వల్లనే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని.. డైరెక్టర్ ను డిస్టర్బ్ చేయకపోతేనే వైవిధ్యమైన సినిమాలు వస్తాయని సీనియర్ దర్శక నిర్మాత అభిప్రాయపడ్డారు. నిబద్ధత అంటే ఏంటో నందమూరి తారక రామారావు – బాలకృష్ణలను ఉదహరిస్తూ చెప్పారు.

అర్జున్ సర్జా లేదా తమ్మారెడ్డి భరద్వాజ చెబుతున్నది నిజమైనప్పటికీ.. జెనరేషన్ తో పాటుగా అన్నీ మారుతూ వచ్చాయనేది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఇండస్ట్రీలోనూ సినిమా మేకింగ్ లోనూ మార్పులు వచ్చాయి. అప్పట్లో హీరో ఒక్కసారి కథ వింటే.. ఆ తర్వాత ఏ విషయంలోనూ జోక్యం చేసుకునేవారు కాదు. అంతా డైరెక్టర్ చూసుకునేవారు. దర్శకుడు ఏది చెబితే కెమెరా ముందు అది చేసి హీరోలు వెళ్ళిపోయేవారు. మిగతా వ్యవహారాల్లో కలుగజేసుకునేవారు కాదు.

కానీ రాను రాను పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హీరోలే అన్నీ చూసుకుంటారు. 24 క్రాఫ్ట్స్ మీద మంచి అవగాహన కలిగి ఉంటున్నారు. బిజినెస్ – మార్కెటింగ్ అంతా హీరోల పేరు మీదుగానే జరుగుతుంది కాబట్టి.. అన్ని విషయాల్లో చెయ్యి కాలు పెట్టేస్తున్నారు. తెరపై విషయాలే కాదు.. తెర వెనుక జరిగే వాటిని కూడా పట్టించుకుంటున్నారు. ముఖ్యంగా స్క్రిప్ట్ విషయం లో ఈ తరం హీరోలు పక్కాగా ఉంటున్నారు.

అప్పటి జెనెరేషన్ లో హీరోకి 2-3 ఫ్లాప్ లు వచ్చినా.. మళ్ళీ సినిమా ఆఫర్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ తరంలో 2-3 ఫ్లాపులు వస్తే ఆ హీరో మార్కెట్ అయ్యిపోయినట్టే.. అతని కెరీర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్లే. అందుకే ఈతరం హీరోలందరూ తమ సినిమాలపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెమ్యునరేషన్ తీసుకున్నాం కదా.. మనకెందుకులే అని అనుకోవడం లేదు.

సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు కూడా తమకు నచ్చని అంశాలపై దర్శకులతో చర్చిస్తున్నారు.. కొత్త సూచనలు చేస్తున్నారు హీరోలు. నిర్మాతల భద్రత గురించి మాత్రమే కాదు.. తమ కెరీర్ గురించి కూడా బాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్ సైతం అర్జున్ మీద రెస్పెక్ట్ తో ముందుగా కథలో ఎలాంటి మార్పులు చెప్పకుండా ఓకే చేసి ఉండొచ్చు. కానీ ఫైనల్ నేరేషన్ టైంకి మరింత బెటర్ చేయడానికి తనకు కొన్ని ఐడియాలు ఇచ్చి ఉండొచ్చు. అందుల్లో తప్పేంలేదు.

అర్జున్ ఇక్కడ విశ్వక్ సేన్ చెప్పిన చేంజెస్ కి అంగీకరించకపోవడంతో.. దీనిపై చర్చించాలని అనుకున్నాడు. కాకపోతే విశ్వక్ ఆ విషయాన్ని ముందే డైరెక్టర్ – ప్రొడ్యూసర్ కు చెప్పాల్సి ఉంది. కానీ సెట్ వేసుకొని మిగతా నటీనటుల కాల్షీట్స్ తీసుకుని అంతా రెడీ చేసుకున్న తర్వాత.. మరికొన్ని గంటల్లో షూటింగ్ అన్నప్పుడు క్యాన్సిల్ చేయమని విశ్వక్ కోరడమే వివాదానికి కారణమైంది.

అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత విశ్వక్ క్లారిటీ ఇవ్వడం.. అర్జున్ కు క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లే అనిపిస్తోంది. ఏదేమైనా ప్రస్తుత రోజుల్లో సినిమా మేకింగ్ లో అప్పటి తరం డైరెక్టర్లు – నేటి తరం హీరోల ఆలోచనలకు అనుగుణంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువనిస్తూ.. కలిసి టీం వర్క్ చేస్తేనే మంచి అవుట్ ఫుట్ వస్తుందని చెప్పాలి.


Advertisement

Recent Random Post:

DEVARA X JIGRA Interview | NTR, Koratala Siva, Karan Johar , Alia Bhatt | Sep27

Posted : September 24, 2024 at 2:27 pm IST by ManaTeluguMovies

DEVARA X JIGRA Interview | NTR, Koratala Siva, Karan Johar , Alia Bhatt | Sep27

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad