యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ సేనాపతి పాత్రలో 28 ఏళ్ళ తర్వాత మరల ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. భారతీయుడు సినిమాతో అందరిని మెస్మరైజ్ చేసిన కమల్ హాసన్ భారతీయుడు 2 చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించాయి. జీరో టోలరెన్స్ అంటూ సేనాపతి విశ్వరూపం మరోసారి తెరపై చూపించాలని ప్రయత్నం చేశారు.
అయితే ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. భారతీయుడు మూవీతో పోల్చుకుంటే దాని దరిదాపుల్లో కూడా ఈ సీక్వెల్ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రాండ్ నెస్ కోసం ప్రయత్నం చేసి మెయిన్ సోల్ డైరెక్టర్ శంకర్ మిస్ చేశారని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. రిలీజ్ కి ముందే ఈ సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. అయితే భారతీయుడు మూవీ సీక్వెల్ కావడంతో కచ్చితంగా ప్రేక్షకులకి చేరువ అవుతుందేమో అనుకున్నారు.
సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, సూర్య లాంటి స్టార్ యాక్టర్స్ సినిమాలో ఉన్నారు. అయితే కథ పరంగా ఒకే అనిపించుకున్న మూడు గంటల నిడివితో ఉన్న కథాంశం బోరింగ్ గా ఉందనే అభిప్రాయం వచ్చింది. కనెక్టివిటీ లేని సీన్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయని విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగానే రిలీజ్ తర్వాత భారతీయుడు మూవీ క్రియేట్ చేసిన అంచనాలని ఈ సీక్వెల్ అందుకోలేకపోయింది. ఈ ప్రభావం మూవీ కలెక్షన్స్ పైన కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాలలో 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో భారతీయుడు 2 మూవీ రిలీజ్ అయ్యింది. వీకెండ్ మూడు రోజులు కాస్తా కలిసిరావడంతో ఓవరాల్ గా 11.47 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకా 13.53 కోట్ల షేర్ ని భారతీయుడు 2 అందుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మూవీ మీద డివైడ్ టాక్ నడుస్తోన్న నేపథ్యంలో మిగిలిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని ఎలా అందుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.