ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మాత్రమే సూపర్ హిట్స్ అవుతాయి. ఆ సూపర్ హిట్స్ చిత్రాల్లో కూడా కొన్ని మాత్రమే ఎప్పటికి గుర్తుండి పోయేలా నిలిచి పోతాయి. దశాబ్దాలు గడిచినా ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆ సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో ఒక సినిమా ఆర్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో అప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీలకు పూర్తి విభిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిందే ఆర్య.
విలక్షణ ప్రేమ కథను దర్శకుడు సుకుమార్ తీసిన తీరు మరింత ఆకట్టుకుని సినిమా ఎప్పటికి ఫ్రెష్‌గా నిలిచిపోయేలా చేసింది. ఫీల్ మై లవ్ అనే కొత్త కాన్సెప్ట్‌ను దర్శకుడు సుకుమార్ ఈ చిత్రంలో చూపించాడు. ఆర్య సినిమా విడుదలై 16 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికి యువత ఫీల్ మై లవ్ అంటున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా కొత్త తరహా ప్రేమ కథలకు ఆర్య చిత్రం ఆజ్యం పోసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అప్పటి వరకు టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌కు అంతగా ప్రత్యేకత లేదు. అప్పట్లో ప్రత్యేక పాట ఉన్నా కూడా వాటిని వ్యాంప్ సాంగ్స్ అనే వారు. తెలుగులో ఐటెం సాంగ్స్‌కు ఆర్యతోనే శ్రీకారం చుట్టారు. ఆ అంటే అమలాపురం పాట ఏ స్థాయిలో సూపర్ హిట్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ఇప్పటికి ఆ పాట మారుమ్రోగుతూనే ఉంటుంది.
ఇక ఈ చిత్రం అల్లు అర్జున్‌కు కెరీర్‌లో రెండవ సినిమా. మొదటి సినిమా గంగోత్రిలో ఆయన్ను చూసిన ప్రేక్షకులు ఇతడు హీరో ఏంట్రా బాబు అనుకున్నారు. రెండు మూడు సినిమాలతోనే ఈయన ఇండస్ట్రీ వదిలి వెళ్లి పోతాడు అనుకున్నారు. కాని ఆర్య చిత్రంలో బన్నీని చూసిన తర్వాత ఇండస్ట్రీకి సరికొత్త సూపర్ స్టార్ దొరికాడని అంతా అనుకున్నారు. డాన్స్‌తో పాటు విభిన్నమైన డైలాగ్ డెలవరీ మరియు బాడీలాంగ్వేజ్‌తో ఆర్య చిత్రంలో అల్లు అర్జున్ నటించి మెప్పించాడు. అద్బుతమైన నటనతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్ ఈ చిత్రంతో వెనుదిరిగి చూసుకోవాల్సి రాలేదు.
ఆర్య చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన మరో సూపర్ స్టార్ సుకుమార్. ఈయన లెక్కల మాస్టర్‌గా కెరీర్‌ను కొనసాగిస్తూ సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆర్య చిత్రంతో సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను దక్కించుకున్న సుకుమార్ ఆ తర్వాత ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌గా నిలిచి పోయాడు. ఈయన తెరకెక్కించిన రంగస్థలం ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆర్య చిత్రంతోనే దేవిశ్రీ ప్రసాద్ సూపర్ స్టార్ అయ్యాడు. అంతకు ముందు వరకు ఒక మోస్తరు సంగీత దర్శకుడిగా పేరు దక్కించుకున్న దేవిశ్రీ ప్రసాద్‌కు తెలుగులో టాప్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చి పెట్టింది ఆర్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్య చిత్రం తర్వాత దేవిశ్రీ ప్రసాద్ సూపర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్‌గా నిలిచాడు. ఆర్య చిత్రం నిర్మాత దిల్‌రాజును కూడా సూపర్ స్టార్‌ను చేసింది.
దిల్ చిత్రంతో నిర్మాతగా మారిన ఆయన రెండవ సినిమాగా ఆర్యను నిర్మించాడు. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆర్య ఏకంగా 30 కోట్ల వసూళ్లను రాబట్టడంతో పాటు ఇతరత్ర రైట్స్‌తో మరో అయిదు కోట్ల వరకు దిల్‌రాజు ఖాతాలో పడేలా చేసింది. రెండవ సినిమాతోనే ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టడంతో ఇండస్ట్రీలో దిల్‌రాజు తిరుగులేని నిర్మాతగా మారిపోయాడు. అందుకే ఆయన ప్రస్తుతం టాలీవుడ్‌లో సూపర్ స్టార్ ప్రొడ్యూసర్‌గా వెలుగు వెలుగుతున్నాడు.
ఇలా నలుగురు సూపర్ స్టార్స్‌ను తెలుగు సినిమా పరిశ్రమకు అందించిన ఆర్య సినిమా విడుదలై నేటికి 16 ఏళ్లు పూర్తి అయ్యింది. మరో 16 ఏళ్లు అయినా కూడా ఆర్యను తెలుగు జనాలు ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు.