స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. రీసెంట్ గానే అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించాడు బన్నీ. తన కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ మాత్రమే కాకుండా ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డులను సైతం క్రియేట్ చేసాడు. దీంతో తన తర్వాతి సినిమా కోసం మరింత ఉత్సాహంగా సన్నద్ధమవుతున్న సమయంలో కరోనా వైరస్ రూపంలో పెద్ద అవాంతరం ఎదురైంది.
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చేయాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ను కేరళలోని దట్టమైన అడవుల్లో మార్చ్ లో షూటింగ్ మొదలుపెడదామని భావించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేరళ వెళ్లి షూటింగ్ చేయడం అనేది అసాధ్యం. దీంతో సుకుమార్ ఆంధ్రప్రదేశ్ లో మారేడుమిల్లిలో షూటింగ్ చేయాలని భావించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా అవుట్ డోర్ కంటే ఇన్ డోర్ షూటింగ్ లకే ప్రాధాన్యతనివ్వమని సూచించింది. అలాగే కరోనా భూతం ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో అవుట్ డోర్ కంటే ఇన్ డోర్ అయితే వీలుగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ లోని అన్నపూర్ణ 7 ఎకరాలలో ఒక మారుమూల పల్లెటూరు, అడవి సెట్స్ ను నిర్మించాలని డిసైడ్ అయ్యారట. సెట్స్ లో అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా షూట్ చేసుకోవచ్చన్నది పుష్ప టీమ్ భావన. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.