స్టైలీష్ హీరో అల్లు అర్జున్ తన కుటుంబతో సహా శనివారం కుంటాల జలపాతాన్ని సందర్శించడం విమర్శలకు దారి తీసింది. అల్లు అర్జున్ సెలబ్రిటీ అయినంత మాత్రాన రూల్స్ వర్తించవా అని సామాన్య ప్రజలు , పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. అటవీశాఖ, పర్యాటక శాఖ అధికారుల అత్యుత్సాహంపై వారు మండిపడుతున్నారు.
అందమైన ప్రకృతిని ప్రేమించని మనసు ఉంటుందా? జలపాతాల్ని ఆస్వాదించని హృదయం ఉంటుందా? …. ఉండవు కాక ఉండవు. తెలంగాణలో వర్షాలు బాగా పడుతుండడంతో కుంటాల జలపాతం చూడ ముచ్చటగా, రమణీయంగా ఉంది. దీంతో ఆ జలపాతం అందాలను అల్లు అర్జున్ తన కుటుంబంతో సందర్శించి పరవశించారు.
సినీ సెలబ్రిటీ కావడంతో అటవీశాఖ అధికారులు దగ్గరుండి జలపాతం విశిష్టతను, అక్కడి ప్రకృతి అందాల గురించి చక్కగా కళ్లకు కట్టారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కుటుంబ ఆదిలాబాద్ పట్టణ శివారులోని హరితవనం పార్కులోని సఫారీలో తిరుగుతూ అం దాలను వీక్షించారు. ఈ సందర్భంలో అల్లు అర్జున్‌తో హరితవనం పార్కులో అటవీ అధికారులు మొక్కలు నాటించారు.
ఇవన్నీ బాగున్నా …ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి సామాన్యులను, పర్యాటకులను మాత్రం కరోనా సాకు చూపి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కరోనా నిబంధనలు సామాన్యులకు, పర్యాటకులకేనా అని వారు ప్రశ్నిస్తున్నారు.
సినీ, రాజకీయ ప్రముఖులకు మాత్రం మర్యాదలు చేయడం, సామాన్యులు, పర్యాటకులను మాత్రం రూల్స్ పేరుతో నిలువరించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నిర్మాత దిల్ రాజు కుటుంబంతో పాటు కుంటాల జలపాతాన్ని సందర్శించడాన్ని ఈ సందర్భంగా స్థానికులు గుర్తు చేస్తున్నారు.