రాష్ట్రాన్ని అమూల్ సంస్థకు తాకట్టు పెట్టేస్తోన్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. అంటూ విపక్షాలు విమర్శిస్తున్న విషయం విదితమే. అయినాగానీ, అమూల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. విపక్షాలు ఏదన్నా విమర్శ.. రాజకీయ కోణంలోనే చేసినా, అందులో మంచి చెడుల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఒకప్పుడు ప్రభుత్వాలు అలాగే వుండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. చంద్రబాబు హయాంలోనూ అంతే.. వైఎస్ జగన్ హయాంలోనూ అంతే.
కరోనా వేళ పరీక్షలు రద్దు చేయడమో వాయిదా చేయడమో చేయాలంటూ విపక్షాలు నినదిస్తే, రాష్ట్ర ప్రభుత్వం లైట్ తీసుకుంది. విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోయారు. చివరికి కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు జోక్యంతో, రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ‘వాళ్ళు చెప్పారు, మేమెందుకు వినాలి.?’ అన్నట్టుంది ప్రభుత్వం తీరు.
ఇక, అమూల్ విషయానికొస్తే, ఈ సంస్థ ద్వారా పాడి రైతులకు మేలు జరుగుతందన్నది ప్రభుత్వ వాదన. అమూల్ అనే సంస్థ వ్యాపారం చేస్తోంది.. సమాజ సేవ అయితే చేయడంలేదు కదా. వ్యాపారంలో ఎవరైనా లాభ నష్టాల గురించే ఆలోచిస్తారు. రైతుల్ని ఉద్ధరించేందుకు అమూల్ సంస్థ నడుం బిగించదు కదా.? ఎక్కువ లాభం ఎక్కడొస్తే, అక్కడ వాలిపోతాయి వ్యాపార సంస్థలు. అమూల్ విషయంలోనూ అదే జరుగుతుంది.
మరి, అమూల్ విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత ప్రత్యేకమైన శ్రద్ధ.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ కేసులు నమోదు చేసి, దాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకోపక్క మూతపడ్డ డెయిరీలను అమూల్ సంస్థకు లీజుకిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థల్ని కూడా ప్రభుత్వమే తన పరిధిలోకి తెచ్చుకుని, ప్రభుత్వం కనుసన్నల్లో అవి అద్భుతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవచ్చు కదా.?
‘పాడి పరిశ్రమ’ అనగానే, దేన్నియినా అమూల్ సంస్థకు కట్టబెట్టెయ్యాలన్న ఆలోచనే ప్రభుత్వం చేస్తోందన్న విమర్శలున్నాయి. ఏ లబ్ది కోసం ప్రభుత్వ పెద్దలు ఇదంతా చేస్తున్నారంటూ విపక్షాలతోపాటు, రాజకీయ విశ్లేషఖులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి.