కరోనా తాండవం జరుగుతున్న వేళ ఏపీలో అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ లో మాయాజాలం చోటుచేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పది నిమిషాల్లోనే కరోనా పరీక్ష ఫలితాన్ని వెల్లడించే ఈ కిట్స్ ను ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసింది.
మొత్తం 10 లక్షల కిట్స్ కు ఆర్డర్ ఇవ్వగా.. తొలి విడతలో లక్ష కిట్లు రాష్ట్రానికి చేరాయి. తొలి కిట్ తో సీఎం జగన్ కు కరోనా నిర్ధారణ పరీక్ష జరిపిన అధికారులు.. ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చినట్టు తెలిపారు. అయితే, ఈ కిట్ ఎంతకు కొనుగోలు చేశారనే విషయాన్ని ఏపీ సర్కారు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో చత్తీస్ గఢ్ కు చెందిన మంత్రి ఒకరు తాము ర్యాపిడ్ టెస్ట్ కిట్ ను ఒక్కోటీ జీఎస్టీ కాకుండా రూ.337కే కొనుగోలు చేశామని, ఇదే అతి తక్కువ ధర అని ట్వీట్ చేయడంతో ఏపీలో దుమారం రేగింది.
రెండు రాష్ట్రాలూ కొరియాకి చెందిన ఒకే కంపెనీ నుంచి ఈ కిట్స్ ని కొనుగోలు చేయడంతో ఏపీ వ్యవహారంలో ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేశాయి. రూ.337 ఖరీదు చేసే కిట్ ను ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.1200 పెట్టి కొనుగోలు చేసిందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు సంధించారు. దీంతో సర్కారు స్పందించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందంటూ దుష్పచారం సాగుతోందని, రూ.1200కి ఆ కిట్ కొన్నారని ఆరోపణలు చేస్తున్నారని.. అదంతా అసత్యమని ప్రకటించింది.
ఒక్కో కిట్ ను రూ.700కి కొనుగోలు చేశామని.. తుది ధరపై సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒకవేళ ఆ కిట్ కి రూ.700 చెల్లించినా.. ఛత్తీస్ గఢ్ వెచ్చించిన మొత్తానికంటే రెట్టింపు ఎక్కువ. దీంతో అటు టీడీపీ నేతలు.. ఇటు సోషల్ మీడియాలో అధికార పార్టీ వ్యతిరేకులు తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఏదైనా వస్తువు కొనే ముందే ధర విషయంలో సంప్రదింపులు ఉంటాయని.. ఫలానా ధరకు కొంటామని ఒప్పందం కుదుర్చుకుని, లక్ష కిట్లు తీసుకున్న తర్వాత ఏ విధంగా బేరమాడతారని ప్రశ్నిస్తున్నారు. దీంతో వీటి ధర విషయంలో కర్ణాటక, ఛత్తీస్ గఢ్, కేరళ వంటి రాష్ట్రాలతో మాట్లాడుతున్నామని.. త్వరలోనే దీనిపై వివరణ ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.