ఎవరు చేసిన దానికి వాళ్లే అనుభవిస్తారని తత్వవేత్తలు చెబుతుంటారు. దీన్నే ఇంగ్లిష్ లో కర్మ ఈజ్ బూమరాంగ్ అంటారు. అంటే మనం చేసిన మంచి-చెడులు తిరిగి మనకే తగుల్తాయన్నమాట. ఇప్పుడు బాలకృష్ణ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. గతంలో బావ చంద్రబాబు అండ చూసుకొని విచ్చలవిడిగా రెచ్చిపోయిన బాలయ్యకు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ ఎదురుదెబ్బలు తగులుతున్నాయేమో అనిపిస్తోంది. దీనికి ఒక చిన్న ఉదాహరణగా నిలిచింది తాజాగా బాలయ్యకు జరిగిన పరాభవం.
చిరంజీవి నేతృత్వంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసానితో చర్చలు జరిపారు. ఆ చర్చలకు బాలకృష్ణను ఎవ్వరూ పిలవలేదు. నిజానికి బాలయ్యను పిలవలేదనే విషయాన్ని చాలామంది గుర్తించలేదు, గమనించలేదు. తనకుతానుగా ఈ విషయంలో బాలయ్య కెలుక్కున్నారు. నన్ను ఎవ్వరూ పిలవలేదు, పత్రికల్లో చూసి అప్ డేట్స్ తెలుసుకుంటున్నానన్నారు. సరిగ్గా ఇక్కడే బాలయ్య గతంలో చేసిన ఓ పనిని అతడికి గుర్తుచేస్తున్నారు నెటిజన్లు.
గతంలో చంద్రబాబు హవా నడిచిన రోజుల్లో బాలయ్య ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని ఆహ్వానించలేదు. “అవును.. కావాలనే ఆహ్వానం పంపించలేదు. ఎవర్ని పిలవాలో, ఎవర్ని పిలవకూడదో నాకు తెలుసు. ఎవ్వర్ని పడితే వాళ్లను నెత్తిన ఎక్కించుకోను. పిలిస్తే వచ్చే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ నేను పిలవను. నా స్టయిల్ లో డిక్టేటర్ పద్ధతిలోనే వెళ్తాను.” అంటూ గతంలో బాలయ్య ఇచ్చిన స్టేట్ మెంట్ ను బయటకు తీసి వదిలారు.
గతంలో బాలకృష్ణ తనకు నచ్చినట్టు తాను వ్యవహరించారని, ఇప్పుడు ఇండస్ట్రీ కూడా బాలయ్యను సైడ్ చేసి తనకు నచ్చినట్టు వ్యవహరిస్తోందని అంటున్నారు చాలామంది. గతంలో బాలయ్య చేసిన పనే అతడికి ఇప్పుడిలా ఎదురుపడిందని సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలయ్యకు మద్దతుగా నిలుస్తున్న అతడి ఫ్యాన్స్ అందరికీ, ఈ వీడియోల్ని చూపిస్తున్నారు మెగా అభిమానులు.
దీంతో రచ్చ ఇప్పుడు పీక్ స్టేజ్ కు వెళ్లింది. ఇక్కడితో ఇది ఆగలేదు. వాళ్లంతా భూములు పంచుకోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తలసాని చుట్టూ తిరుగుతున్నారని బాలయ్య తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి కౌంటర్ గా అమరావతి ప్రాంతంలో చంద్రబాబు చేసిన భూపందేరం మొత్తాన్ని వార్తా క్లిప్పింగులు రూపంలో బయటపెడుతున్నారు మెగా ఫ్యాన్స్.