ఒక్కో ఫ్యామిలీకి ఒక్కొక్కరు వుంటారు. చంద్రబాబుకు బాలయ్య, పవన్ బాబుకు నాగబాబు మాదిరిగా. నోరా..వీపుకు తేకే అన్నటైపు. వీళ్లకు నోరు కాస్త స్పీడుగా వుంటుంది. అందరూ ఆలోచించి మాట్లాడితే వీళ్లు మాట్లాడిన తరువాత కూడా ఆలోచిస్తారో లేదో డౌటు.
రాజకీయాల్లో వాక్యూమ్ లేని టైమ్ లో ప్రవేశించి బోర్లా పడ్డారు మెగాస్టార్. కానీ ఇప్పడు టాలీవుడ్ లో వాక్యూమ్ వుంది. ఇండస్ట్రీ పెద్ద అనే పోస్టు ఖాళీగా వుంది. పైగా అది పెద్దగా ఎవరికీ అక్కరలేదు. కావాలనుకునే రాజశేఖర్ లాంటి వాళ్లకు అందనంత ఎత్తులో వుంటుంది. సూటయ్యే మోహన్ బాబు లాంటి వాళ్లకు మాట పెళుసుతనం అడ్డం పడుతుంది. అందువల్ల అతి సులువుగా ఇది చేతిలోకి అంది వచ్చేలా కనిపించింది మెగాస్టార్ చిరంజీవికి.
ఇంక ఎన్నాళ్లు సినిమాలు చేస్తాం? మహా అయితే మరో రెండు మూడేళ్లు. 70 ఏళ్లకు దగ్గర పడితే ‘అమ్మడు..కుమ్ముడు’ పనికి రాదుగా. అందువల్ల సినిమాలు మానేసాక కూడా ఇండస్ట్రీలో మాట చెల్లుబాటు కావాలంటే ఎలా? దానికి దగ్గర దారి, ఈ ఇండస్ట్రీ పెద్దరికాన్ని అందిపుచ్చుకోవమే.
అనాలోచితమా? ఆరోపణా?
సో, ఆ దిశగా అడుగులు కదిపారు. అంతవరకు బాగానే వుంది. తోటి లెజెండ్స్ బాలయ్య, మోహన్ బాబు లాంటి వాళ్లందరినీ కలుపుకుంటూ వెళ్తే బాగుండేది. కానీ అలా చేయలేదు. అక్కడే వచ్చింది సమస్య. ఎవరు, ఎప్పుడు, ఎందుకు కెలికారో కానీ బాలయ్య ఆయన స్టయిల్ లో మాట్లాడారు. సరే,పరుష పదజాలం వాడారా? బీప్ వర్డ్ ఏమిటి అన్నది ఆలోచించక్కరలేదు. ఎందుకుంటే అది బాలయ్య స్టయిల్. కానీ భూములు పంచుకోవడానికా? అన్న మాట ఎందుకు వాడాల్సి వచ్చింది? అన్నది అసలు సిసలైన ప్రశ్న.
ఇలాంటి పెద్ద ఆరోపణ కేవలం అనాలోచితంగా రాదు. ఈ మాట బయటకు రావడానికి ముందే బాలయ్య దగ్గరో, బాలయ్య సర్కిల్ లోనో ఇలాంటి డిస్కషన్ జరిగి వుండాలి. అది ఇప్పుడు అనుకోకుండా బయటకు వచ్చిందనుకోవాలి. ఇప్పడు తెలియాల్సింది ఇది ఎంతవరకు నిజం అన్నది.
‘రియల్’ వ్యాపారం
ఇకపోతే ఇంక తెలియాల్సిన రెండో నిజం కూడా వుంది. ఈ తేనెతుట్టను కదిపింది నాగబాబు. ఆయన బాలయ్య మాటలకు కౌంటర్ ఇవ్వడం వరకు ఓకె. మెగాస్టార్ తమ్ముడిగా ఆయన ఆవేశం ఆయనది, ఆయన మాటల పదును ఆయనది. కానీ ఆయన కూడా బాలయ్య మాదిరిగా ఓ పాయింట్ దగ్గర ఆగలేదు. తెలుగుదేశం పార్టీని కెలికారు. ఆ పార్టీ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కెలికారు. దాని వల్ల సాధారణ ప్రజానీకం ఇబ్బందలు పడిన, పడుతున్న వైనాన్ని బయటకు తీసారు. తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పినా, ఇది జనసేన పార్టీ సభ్యుడు నాగబాబు చెప్పిన అభిప్రాయమే. ఎందుకంటే పార్టీ అభిప్రాయం కాకపోవచ్చు కానీ పార్టీ సభ్యుడి అభిప్రాయమేగా. ఇప్పుడు ఈ ప్రశ్న కొన్నాళ్ల పాటు పవన్ కళ్యాణ్ ను కూడా వెంటాడుతూనే వుంటుంది.
ఉరుము ఉరిమి…
ఇదంతా ఇలా వుంచితే బాలయ్య చేసిన కామెంట్ కు మంత్రి తలసాని కి కూడా తలనొప్పే. ఎమీ లేకున్నా, ఇప్పుడు ఆయన ఇరుకున పడే పరిస్థితి. అసలే కేసిఆర్ దగ్గర మంత్రులకు దినదినగండంగా వుంటుంది. ఇలాంటి కామెంట్లు, విమర్శలు వస్తే కేసిఆర్ కాస్త అటు దృష్టి పెట్టే ప్రమాదం వుంది. ఆ విధంగా బాలయ్య పుణ్యమా లేదా టాలీవుడ్ వర్గాల పుణ్యమా అని మంత్రి తలసాని కూడా ఇరుకున పడే ప్రమాదం వుంది.
ఒకటి మాత్రం పక్కా
ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎవరు ఎన్ని వ్యవహారాలు చేసినా, టాలీవుడ్ లో ఐక్యత అన్నది నేతిబీరకాయ లో నెయ్యి చందమే. ఇక్కడ రెండు వర్గాలు ఎప్పుడూ వుంటూనే వుంటాయి. అయితే సినిమాలు, వ్యాపారాలు, అవసరాలు, రాజకీయాలు ప్రాతిపదికగా ఇవి కలుస్తూ వుంటాయి. విడిపోతూ వుంటాయి. అవసరం అయితే ఏకతాటిపైకి వస్తుంటాయి, పోతుంటాయి తప్ప, కలిసి ఎప్పటకీ వుండడం అన్నది అంత సులువుగా సాధ్యం అయ్యే పని అయితే కాదనుకోవాలి.
ఆర్వీ