వైఎస్ జగన్ ప్రభుత్వం ఏం చేసినా అందులో ‘చెడు’ చూడటమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఓ టీడీపీ ఎమ్మెల్యే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలోచనల్ని స్వాగతించారు. ఆ టీడీపీ ఎమ్మెల్యే ఇంకెవరో కాదు, నందమూరి బాలకృష్ణ. హిందూపురం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తోన్న బాలకృష్ణ, హిందూపురం పట్టణ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌తోపాటు, రాష్ట్ర్ చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీకి కూడా లేఖ రాశారు.
అంతే కాదు, తన నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే విషయమై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపుతూనే, అందుకు తగ్గ భూమి అందుబాటులో వున్నాయనీ, అన్ని సౌకర్యాలూ వున్నాయంటూ ఓ ప్రాంతాన్ని కూడా ప్రస్తావించారు నందమూరి బాలకృష్ణ.
ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ, ఒకప్పుడు వైఎస్ జగన్ తనకు వీరాభిమాని అనే విషయాన్ని చెప్పిన విషయం విదితమే. అందులో నిజం లేకపోలేదు. చాలాకాలం క్రితం వైఎస్ జగన్, కడప ప్రెసిడెంట్‌గా బాలయ్య అభిమానుల సంఘానికి పనిచేశారు. అయితే, రాజకీయం వేరు. ‘వైఎస్ జగన్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు. మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం.. అదీ అతి త్వరలో..’ అంటూ కొద్ది రోజుల క్రితమే బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేస్తే.. బాలయ్య వ్యాఖ్యల్ని గట్టిగానే తిప్పి కొట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అదేనండీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.
అన్నట్టు, హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య గెలుపు వెనుక చాలా ‘మతలబులు’ జరిగాయనీ, బాలయ్యను గెలిపించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్, తనకు అత్యంత సన్నిహితుడ్ని కూడా లైట్ తీసుకున్నారంటూ రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ గుసగుసలు విన్పిస్తూనే వున్నాయి. మిగతా విషయాలు పక్కన పెడితే, బాలయ్య.. ప్రభుత్వానికి రాసిన లేఖ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ మధ్యనే పార్లమెంటరీ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాల విభజన చేయడం సబబు కాదంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విషయం విదితమే. ఇంతలోనే బాలయ్య.. హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరడం ఆశ్చర్యకరమే మరి.