పౌరాణికం, చారిత్రిక మరియు జానపద చిత్రాలు.. ఇలా ఏ చిత్రంలోనైనా ఔరా అనిపించగల నటుడు నందమూరి బాలకృష్ణ. ఇటీవలే ఆయన మొదలు పెట్టి ఆపేసిన డ్రీం ప్రాజెక్ట్ అయిన నర్తనశాల నుంచి 16 నిమిషాల ఫుటేజ్ ని రిలీజ్ చేశారు. అలాగే ఆయనకి చారిత్రక, జానపద సినిమాలు చెయ్యడం అంటే చాలా ఇష్టం. తన 100వ చిత్రంగా చారిత్రక వీరుడైన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేసిన ఆయన మరోసారి మరో చారిత్రిక వీరుడి సినిమాకి శ్రీకారం చుట్టే పనిలో ఉన్నారు..
ఇక అసలు విషయంలోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కోవిడ్ కారణంగా షూటింగ్ ఆగిపోయిన ఈ సినిమా సరికొత్త షెడ్యూల్ నవంబర్ 29 నుంచి హైదరాబాద్ లో మొదలు కానుంది. ఇది పక్కన పెడితే ఆయన తదుపరి సినిమాల విషయంలో పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా రుద్రమదేవి పరిపాలన సమయంలో తెలంగాణ బందిపోటుగా అందరికి సుపరిచితుడైన ‘గోనగన్నా రెడ్డి’పై సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. బోయపాటి సినిమా తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
బాలకృష్ణ తన టీంతో కలిసి దీనికి సంబందించిన పనులను సీక్రెట్ గా ఫినిష్ చేసేస్తున్నారట. కానీ ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేవిషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి బాలయ్య యువకుడైన గోనగన్నా రెడ్డి పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేసి షూట్ చేస్తారో? అసలు గెటప్ ఎలా ఉంటుంది అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..