పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘గబ్బర్‌సింగ్’ విడుదలై ఇటీవల 8 ఏళ్లు అయిన సందర్బంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ సినిమా గురించిన చర్చ జరిగింది. దర్శకుడు హరీష్ శంకర్ సినిమా జ్ఞాపకాలను మీడియాతో షేర్ చేసుకున్నాడు. ఆ సందర్బంగా బండ్ల గణేష్‌ను దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్థావించలేదు. కావాలని ఆ పేరును వదిలేశాడో లేదంటే మర్చిపోయాడో కాని నిర్మాత బండ్ల గణేష్ గురించిన ప్రస్థావన తీసుకు రాకుండా హరీష్ శంకర్ ఆ సినిమా జ్ఞాపకాలను మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
హరీష్ శంకర్ తన పేరు ఎత్తక పోవడంపై బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో స్పందించాడు. విశ్వాసం లేదంటూ హరీష్ శంకర్ తీరును బండ్ల గణేష్ దుమ్మెత్తి పోశాడు. తాజాగా ఆ విషయమై హరీష్ శంకర్ కాస్త సీరియస్‌గానే స్పందించాడు. ఒక వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గురించి స్పందిస్తూ.. ఆంజనేయులు, తీన్మార్ తీసి రోడ్డు మీద ఉన్న ఆయన్ను నేనే గబ్బర్‌సింగ్ తీసి నిలబెట్టాను అంటూ నేను అనగలను. కాని నేను అలా అనను. ఎందుకంటే నాకు అది సంస్కారం కాదు. గబ్బర్‌సింగ్ నాకు ఆయన ఛాన్స్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు. అసలు దానికి నిర్మాత నాగబాబు గారు.
నా గురించి ఒక దిల్‌రాజు గారో లేదంటే అల్లు అరవింద్ గారు, మైత్రి నవీన్ గారు వంటి వారు అంటే నేను నాలో ఏమైనా తప్పు ఉందా అని అనుకుంటాను. కాని క్రెడిబులిటీ లేని వారు నా గురించి మాట్లాడితే దాన్ని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరి క్రెడిబులిటీ ఎంత అనే విషయాన్ని తెలుసుకోవాలంటూ హరీష్ శంకర్ తీవ్ర స్థాయిలో బండ్ల గణేష్‌కు సూచించాడు. ఈ వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.