టాలీవుడ్ సినిమాలు మునుపెన్నడూ లేని విధంగా ఇప్పడు ఉత్తరాదిలో రికార్డుల మోత మోగిస్తున్నాయి. కనీసం ప్రమోషన్స్ చేయకపోయినా సరే సినిమా నచ్చిందా…అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. దీంతో మన వాళ్లు ఉత్తరాది ప్రేక్షకుల కోసం హిందీలోనూ విడుదల చేయడం మొదలుపెట్టారు. ఇటీవల విడుదలై `పుష్ప` ఉత్తరాదిలో రూ.100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడంతో ఇప్పడు మన స్టార్ హీరోల దృష్టి ఉత్తరాదిపై పడింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కేవలం మౌత్ టాక్ తో `పుష్ప` 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడం విశేషం.
ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రానా తొలిసారి కలిసి నటంచిన హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా `భీమ్లానాయక్`ని కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నారు. ముందే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్రయత్నించినా సమయం తక్కువగా వుండటంతో ఆలస్యంగా హిందీలో విడుదల చేస్తున్నారు. గత నెల 25న విడుదలైన `భీమ్లానాయక్` బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
చాలా రోజుల తరువాత పవన్ మాస్ పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన తీరు అభిమానులతో పాటు సగటు సినీ ప్రియుల్ని అమితంగా ఆకట్టుకుంది. తమన్ నేపథ్య సంగీతం పవన్ – రానా నువ్వా – నేనా అనే స్థాయిలో పోటీపడి నటించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. చాలా రోజుల తరువాత పవన్ నుంచి వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ కావడంతో థియేటర్ల వద్ద జాతర మొదలైంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టిన ఈ చిత్రాన్ని కొతం ఆలస్యంగా హిందీలో రిలీజ్ చేస్తున్నారు.
ఈ మూవీని హిందీలో B4U మోషన్ పిక్చర్స్ గ్రాండ్ మాస్టర్ బ్యానర్స్ పై సునిల్ షా రాజా సుబ్రమణియన్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ ని రిలీజ్ చేస్తున్న మేకర్స్ ట్రైలర్ ని విడుదల చేశారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే హిందీ వెర్షన్ ట్రైలర్ లో మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించకపోవడం గమనార్హం. తెలుగు లో సినిమా రిలీజై వారం దాటిన నేపథ్యంలో హిందీ వెర్షన్ ట్రైలర్ ని విడుదల చేశారు.
అయితే హిందీలో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారన్నది స్పష్టం చేయలేదు. `రాధేశ్యామ్` రిలీజ్ నేపథ్యంలో రిలీజ్ డేట్ ని ప్రకటించలేదా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా వుంటే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో కలిసి ఆహా సొంతం చేసుకుంది. మార్చిలో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో `భీమ్లానాయక్` హిందీ ట్రైలర్ విడుదల కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.