భూమా అఖిలప్రియ.. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమె టీడీపీలోనే వున్నారు. కిడ్నాప్ కేసులో అరెస్టయి ఏ1 నిందితురాలిగా వున్న భూమా అఖిలప్రియ విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఇంతవరకు భూమా అఖిలప్రియ అరెస్టుని టీడీపీ నేతలెవరూ ఖండించకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
‘ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయం. పార్టీకి ఎలాంటి సంబంధం లేని వ్యవహారం. అందుకే పార్టీ ఈ విషయంపై స్పందించకూడదని నిర్ణయం తీసుకుంది..’ అంటూ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. నిజానికి, భూమా అఖిలప్రియ అరెస్టు వ్యవహారంతో రాజకీయ లబ్ది ఏమన్నా చేకూరుతుందనుకుంటే, అస్సలేమాత్రం టీడీపీ ఆగేది కాదు.. ఏదో తరహా యాగీ చేసేదే.
మరోపక్క, టీడీపీకి అస్సలెలాంటి అవకాశమూ ఇవ్వకుండా తెలంగాణ పోలీసులు, పక్కాగా ఆధారాలు సేకరించారు. ఎప్పటికప్పుడు ఆయా అంశాల్ని మీడియా ముందుంచుతున్నారు తెలంగాణ పోలీసులు. ఓ మహిళ అయి వుండి, కిడ్నాప్‌కి ప్లాన్ చేయడం, మొత్తం వ్యవహారాన్ని ఆర్గనైజ్ చేయడం వంటి విషయాలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. దాంతో, అఖిలప్రియ ప్రెగ్నెంట్ అయినా కూడా ఆమె పట్ల కించిత్ సానుభూతి ఎక్కడా కనిపించడంలేదు.
ఈ ఎపిసోడ్‌లో ఇంకో షాకింగ్ విషయమేంటంటే, అఖిలప్రియ భర్త పరారీలో వుండడం. భార్య గర్భవతి అయినా, ఆమె అరెస్టయి పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నా.. అదేమీ తనకు పట్టనట్టు అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పరారవడం నిజంగానే షాకింగ్ ట్విస్ట్. కట్టుకున్న భర్తకే భార్య పరిస్థితిపై సానుభూతి లేనప్పుడు, టీడీపీ మాత్రం ఈ విషయంలో ఎందుకు కలగజేసుకుంటుంది.? అన్నది ఓ చర్చ.
టీడీపీ కూడా లైట్ తీసుకున్నాక, అఖిలప్రియ మీద సానుభూతి చూపేదెవరు.? అన్నది మరో చర్చ. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత.. అన్నట్టు, అఖిలప్రియ దుందుడుకు వైఖరే ఆమెకు ఇంత పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. ఆమెతోపాటు మొత్తం కుటుంబం ఇప్పడు అయోమయంలో పడింది. అంతేనా, తెలుగునాట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిల పరువు ప్రతిష్టలు గంగపాలయ్యాయి.