సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేలాది, లక్షలాది పోస్ట్‌లు నిత్యం దర్శనమిస్తున్నాయి. వీటిల్లో మెజార్టీ పోస్ట్‌లు చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు గత కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌కే పరిమితమవడంపై వుంటుండడం గమనార్హం.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో చంద్రబాబు, కుటుంబ సమేతంగా హైద్రాబాద్‌లో వుండిపోయారన్నది అందరికీ తెల్సిన విషయమే. కానీ, ఇలా ఎన్నాళ్ళు.? తెలుగు తమ్ముళ్ళను ఈ ప్రశ్న ఇప్పుడు ఇంకాస్త గట్టిగానే తాకుతోంది. లాక్‌డౌన్‌కి సంబంధించి చాలా వెసులుబాట్లు వచ్చాయి. ప్రతిపక్ష నేత గనుక, చంద్రబాబు సొంత రాష్ట్రానికి వెళ్ళదలచుకుంటే ఆయన్ను అడ్డుకునేవారెవరూ వుండరు.
‘హోం క్వారంటైన్’ వంటి నిబంధనలు పెట్టి వైఎస్ జగన్ ప్రభుత్వం, చంద్రబాబుని అడ్డుకోవాలని చూస్తే.. అది ఆటోమేటిక్‌గా తెలుగుదేశం పార్టీకే ప్లస్ అవుతుంది. చంద్రబాబు ‘లెక్కలు’ తెలిసిన మనిసి. అయినాగానీ, ఆయన ఈ ప్రత్యేక పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమవుతున్నారు.
సరే, ఆయన వయసు 70 సంవత్సరాలు గనుక.. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా వుంటున్నారని అనుకోవచ్చు. లోకేష్ పరిస్థితేంటి.? మాజీ మంత్రి.. పైగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు కూడా అయిన నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్‌కి ఎందుకు రావడంలేదు.? అన్న ప్రశ్నకు తెలుగు తమ్ముళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు.
విశాఖలో గ్యాస్ లీక్ ఘటన 12 మందిని బలి తీసుకుంటే, బాధితుల్ని పరామర్శించడానికి టీడీపీ అధినేతగానీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానీ వెళ్ళలేకపోయారు. టీడీపీ అధినేత, ఆయన కుమారుడి వైఖరి.. ఆటోమేటిక్‌గా అధికార పక్షానికి కలిసొస్తోంది. మే 31 తర్వాత అయినా చంద్రబాబు, లోకేష్ అమరావతికి తిరిగి రాకపోతారా.? అని తెలుగు తమ్ముళ్ళు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.