‘ఏ మాయ చేసావే’లో సమంత చేసిన మ్యాజిక్ కు ఎంత పేరొచ్చిందో.. ఆమె వాయిస్ కు అంతే పేరు వచ్చింది. ఆ వాయిస్ ఇచ్చింది ప్రముఖ గాయని ‘చిన్మయి శ్రీపాద’. అన్యాయంపై గళమెత్తే చిన్మయి మీటూ ఉద్యమంలో ఎలాంటి సంచలనాలు రేపిందో తెలిసిందే. ప్రస్తుత కరోనా సమయంలో కూడా ఆమె సైలెంట్ గా తన పని తాను చేశారు. తనలో ఉన్న కళను ఆపదలో ఉన్న వారికి సాయం చేసేందుకు ఉపయోగించింది. ప్రస్తుతం చిన్మయి చేసిన సాయం నెటిజన్లే కాదు హీరోయిన్ సమంత చేత శెభాష్ అనిపించుకుంటోంది.
లాక్ డౌన్ సమయంలో దాదాపు 3వేల ఆడియోలు రికార్డ్ చేసి శ్రోతలకు షేర్ చేసింది. ఇందుకు ఆమెను సోషల్ మీడియా వేదికగా కోరిన వారు ఎందరో ఉన్నారు. ఇలా దాదాపు 85 లక్షల విరాళం సేకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోరిక మేరకు ఆడియోలను పంపించగా వారు తమ సాయాన్ని ఆపన్నులకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ క్లిష్ట సమమయంలో నిత్యావసరాలు కొనలేని వారికి.. స్కూల్ ఫీజులు కట్టలేని వారికి ఈ సాయం ఎంతో ఉపయోగపడింది. ఇకపై కూడా దీనిని ఇలానే కంటిన్యూ చేయాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.
సాయం చేసిన వారిలో ఓ ఎన్నారై 1.50 లక్షలు సాయం చేసి 20 కుటుంబాలకు సాయం చేశాడని.. ఓ స్టూడెంట్ 27 వేలు ఇచ్చాడని చెప్పుకొచ్చింది. ఇవేమీ తాను కోరలేదని.. కానీ మానవత్వం ఇంకా మిగిలే ఉందని వీరందరి ద్వారా రుజువైందని చెప్పుకొచ్చింది.