ఇటీవల టాలీవుడ్‌కు మెగాస్టార్ చిరంజీవి పెద్ద దిక్కు అయ్యారు. ఏ సమస్య వచ్చినా చిరంజీవినే ఆశ్రయిస్తున్నారు. గతంలో టాలీవుడ్‌కు దాసరి నారాయణరావు పెద్ద దిక్కుగా ఉంటూ చిత్ర పరిశ్రమకు ఏ కష్టమొచ్చినా ఆదుకునే వారు. దాసరి మరణా నంతరం ఆ లోటును చిరంజీవి భర్తీ చేస్తుండడం గమనార్హం. అయితే చిత్ర పరిశ్రమ ఆపద్బాంధవుడు చిరంజీవే ఎందుకయ్యారు? అనే ప్రశ్న సహజంగానే చర్చనీయాంశమైంది. రెండు రోజుల క్రితం బాలకృష్ణ తీవ్ర పదజాలంతో చిత్ర పరిశ్రమ పెద్దలను ఆరోపిం చడం కూడా ఈ చర్చకు మరింత ప్రాధాన్యం ఇచ్చింది.
బాలకృష్ణ ఆరోపణల అనంతరం చిరంజీవి పలుకుబడి గురించి చర్చించే ముందు ఇద్దరు సినీ ప్రముఖుల అభిప్రాయాలను పరిశీలిద్దాం. వాటి లోగుట్టు ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
“చిరంజీవి, నాగార్జునను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వం వహించమన్నారు. కాబట్టి వాళ్ల ద్వారా చర్చలు జరిగాయి. చిరంజీవి గారింట్లో చర్చలు జరుపుదామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇండస్ట్రీకి ఎవరి ద్వారా మేలు జరుగుతుంటే…వాళ్ల వెనుక వెళుతుంది”…సికళ్యాణ్, నిర్మాత
“ప్రభుత్వం తరపున ఎవరో అడిగితే చిరంజీవి వెళ్లినట్టున్నారు. దీన్ని సమస్య చేయాల్సిన అవసరం లేదు. వెంకటేశ్, మహేశ్ బాబు, రాజశేఖర్…చాలా మంది హీరోలున్నారు కదా! అందరినీ పిలవలేదు. అవసరం ఉన్నవాళ్లని పిలిచి ఉంటారు. బాలకృష్ణతో అవసరం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళుతారు కదా?”…తమ్మారెడ్డి, దర్శక నిర్మాత
సి.కళ్యాణ్ మాటల్లో ఇండస్ట్రీకి ఎవరి ద్వారా మేలు జరుగుతుంటే వాళ్ల వెనుక వెళుతుందనడం, అలాగే దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నట్టు అవసరం ఉన్నవాళ్లని పిలిచి ఉంటారని, బాలకృష్ణతో అవసరం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళతారు కదా అని ప్రశ్నించడంలో నిగూఢమైన అర్థాలు దాగి ఉన్నాయని టాలీవుడ్‌లో చర్చ జరుగుతుంది. చిరంజీవి ద్వారా మేలు జరుగుతుందని భావించి టాలీవుడ్ ఆయన వెంట నడుస్తుందని సి.కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. అలాగే బాలకృష్ణతో ప్రస్తుతం పనేం లేదని, ఆయన చేయగలిగేది కూడా ఏమీ లేదని తమ్మారెడ్డి పరోక్షంగా చెప్పారు. అంతేకాదు టాలీవుడ్ అవసరాలు తీర్చగలిగే పలుకుబడి చిరంజీవి, నాగార్జునలకు మాత్రమే ఉందని చిత్రపరిశ్రమ పెద్దల అభిప్రాయాలను మనం గమనించవచ్చు.
గత ఏడాది అక్టోబర్ 2 చిరంజీవి కథా నాయకుడిగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలైంది. ఇది హిట్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ను తాడేపల్లిలోని ఇంట్లో చిరంజీవి దంపతులు అక్టోబర్ రెండో వారంలో కలిశారు. చిరంజీవి దంపతులకు జగన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. కలిసి భోజనం చేశారు. ఆప్యాయంగా చర్చించుకున్నారు. పరస్పరం శాలువాలతో సత్కరించుకున్నారు. మెమెంటోలు ఇచ్చుకున్నారు.
ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖులు హాజరైన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు సాయం చేసేందుకు జగన్ ఎంతో సుముఖంగా ఉన్నారన్నారు. అంతేకాదు, తాను ఫోన్ చేసి కలవాలనుకుంటున్నట్టు చెబితే, ‘అక్కతో కలిసి ఇంటికి రాండి అన్నా’ అని ఆహ్వానించారన్నారు. జగన్ ఆహ్వానానికి, ఆప్యాయతలకు మంత్రముగ్ధుడినయ్యానని చిరంజీవి తెలిపారు. వారం క్రితం కూడా జగన్‌కు ఫోన్ చేసి తమపట్ల కనబరుస్తున్న ఆదరాభిమానాలకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే సార్వత్రిక ఎన్నికల ముందు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌ను అగ్రహీరో అక్కినేని నాగార్జున కలిశారు. మొదటి నుంచి నాగార్జునకు జగన్‌తో మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి, నాగార్జునను తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వ బాధ్యతలు తీసుకోమన్నట్టు సి.కళ్యాణ్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జగన్ దంపతులను చిరంజీవి దంపతులు కలిసిన తర్వాత మెగాస్టార్ పలుకుబడి అమాంతం పెరిగింది. ఒకానొక దశలో వైసీపీలో చిరంజీవి చేరుతారని, రాజ్యసభ సీటు ఇస్తారని కూడా విస్తృత ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని నాగబాబు ఖండించారు. అయిన ప్పటికీ ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణలోనూ ఆయా రాష్ట్రాల సీఎంల వద్ద చిరంజీవి మాట చెల్లుబాటు అవుతుందనే సందే శాన్ని జగన్, కేసీఆర్ తమ వాత్సల్యం ద్వారా పంపగలిగారు.
దీంతో చిత్ర పరిశ్రమలో ఏ చిన్న సమస్య లేదా అవసరం వచ్చినా తప్పని సరి పరిస్థితుల్లో చిరంజీవి, నాగార్జునను సంప్రదించాల్సి వస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద చిరంజీవికి పలుకుబడి ఉండడం…చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా గుత్తాధిపత్యం చెలాయిస్తున్న బాలకృష్ణ, ఇతరత్రా నటులకు ఈ ధోరణులు ఏ మాత్రం గిట్టడం లేదు.
తెలంగాణ సీఎం, మంత్రులతో టాలీవుడ్ పెద్దలు కలవడం కొందరు చిత్ర పరిశ్రమలోని నటులకు రుచించడం లేదు. ఆ అసంతృప్తి, అసహనం నుంచే బాలకృష్ణ నోటి నుంచి ‘భూములు పంచుకోడానికి కలుసుకున్నారా’ అనే తీవ్ర ఆరోపణలు పుట్టుకొచ్చాయని చిరంజీవి వర్గం చెబుతోంది. తనను సీఎం క్యాంప్ ఆఫీస్‌కు పిలిపిస్తారనుకుంటే…ఏకంగా ఇంటికే పిలిచి బ్రహ్మాండమైన అతిథి మర్యాదలు చేసి చిరంజీవిని సాగనంపడం ద్వారా పరోక్షంగా మెగాస్టార్ ఇమేజ్‌ని రాజకీయంగా కూడా జగన్ పెంచినట్టైంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు…టాలీవుడ్‌లో బాలకృష్ణ సామాజిక వర్గం ఆధిపత్యానికి చిరంజీవి రూపంలో జగన్ చెక్ పెట్టినట్టైంది. చిత్ర పరిశ్రమ అవసరాలు తీరాలంటే చిరంజీవిని ఆశ్రయిస్తే సరిపోతుందనే సందేశాన్ని జగన్, కేసీఆర్ విస్పష్టంగా పంపగలిగారు. ఈ నేపథ్యంలో మున్ముందు టాలీవుడ్ రాజకీయాలు ఏ రూపం తీసుకుంటాయో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.