మెగాస్టార్ చిరంజీవి ఆవేదన చెందారు. ప్రపంచ వ్యాప్తంగా యువత డ్రగ్స్‌కు బానిసై ఉజ్వల భవిష్యత్‌ను సర్వనాశనం చేసుకోవడమే ఆయన ఆవేదనకు కారణం. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినాన్ని జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఏపీ డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, చెస్ క్రీడాకారిణి నైనజశ్వల్, పలు కళాశాలల విద్యార్థులు, ఇతర ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. డీజీపీ సవాంగ్ మాదక ద్రవ్యాల వినియోగ నివారణపై అవగాహన బ్రోచర్‌ను విడుదల చేశారు.
వెబినార్ ద్వారా చిరంజీవి మాట్లాడుతూ స్ఫూర్తిదాయక, చైతన్యవంతమైన మాటలు చెప్పారు. ఎన్నో జన్మల పుణ్య ఫలం మనిషి జన్మ అని చెప్పడం ద్వారా మానవ జీవిత ఔన్నత్యాన్ని ఆవిష్కరించారు. అలాంటి అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవటం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.
మన మీద ఆధారపడ్డ కుటుంబాల్ని వీధిన పడేయటం సమంజసమా అని నిలదీశారు. చెడు అలవాట్లకు బానిసైన వారిని చూసి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి వాళ్ల వైపు నుంచి ఆలోచించాలని భావోద్వేగంగా ఆయన చెప్పడం ఆకట్టుకుంది. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే ఆనందపడతారా? అనే ప్రశ్న సంధించడం ద్వారా మత్తుకు బానిసైన వారు పశ్చాత్తాప పడేలా చేశారు.