నిన్న మెగా అభిమానులకు మెగా స్టార్ చిరంజీవి చాలా పెద్ద షాకే ఇచ్చాడు. ప్రస్తుతం టాప్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవి తన తర్వాతి మూడు సినిమాల లైనప్ ను ప్రకటించి మెగా అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేసాడు. ఎందుకంటే చిరంజీవి వంటి దర్శకుడు ఫామ్ లో లేని, అసలు రొటీన్ దర్శకుడు అన్న పేరున్న, అసలు సోదిలో లేని దర్శకులతో జట్టు కడుతుండడమే దీనికి కారణం.
ఆచార్య తర్వాత సాహోతో భారీ ప్లాప్ ను అందుకున్న సుజీత్ తో సినిమాను చేయబోతున్నాడు. ఆ తర్వాత రొటీన్ దర్శకుడన్న పేరున్న బాబీతో మరో సినిమా ఉంటుందని, ఇక మూడోది మెహర్ రమేష్ తో సినిమా అని తెలిపాడు. ఇలా యువ దర్శకులతో సినిమాలను చేయబోతున్నట్లు చెప్పాడు.
చిరంజీవి ఓకే అంటే స్టార్ దర్శకులు లైన్లో ఉండి మరీ కథలు చెబుతారనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఉంది. మరి అలాంటిది చిరు ఎందుకని ఈ రకమైన లైనప్ ను పెట్టుకున్నట్లు? వెంకీ మామ అనే పరమ రొటీన్ సినిమాను తెరకెక్కించి విమర్శలు అందుకున్నాడు బాబీ. హాలిడే సీజన్ కలిసి రావడంతో వెంకీ మామ వర్కౌట్ అయింది. ఇక మెహర్ రమేష్ పేరు ఎత్తగానే మెగా అభిమానులకు చెమట్లు పడుతున్నాయి. ఆయన్ను ఏ రకంగా యువ దర్శకుడు అన్నాడో. తన కెరీర్ లో అన్నీ డిజాస్టర్లే ఇచ్చిన మెహర్ రమేష్ ను ఏ రకంగా నమ్ముతున్నాడో అర్ధం కావడం లేదని మెగా ఫ్యాన్స్ బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
చిరంజీవి తలుచుకుంటే హరీష్ శంకర్, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులు పనిచేయడానికి రెడీగా ఉంటారు. మరి చిరంజీవి ఎందుకు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు? లేక ఆ స్టార్ దర్శకులే చిరంజీవి వద్దకు రావడం లేదా?