టాలీవుడ్ సీనియర్ నటి హేమ పరిచయం అక్కర్లేని గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్-3 కంటెస్టెంట్‌గా హౌస్‌లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం. అతి తక్కువ కాలంలోనే హేమ బయటికి రావాల్సి వచ్చింది. దీనికి అనేక కారణాలున్నాయి. ముక్కుసూటితనం ఆమె సొంతం. దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారనే పేరు ఆమె బలం, బలహీనతగా చెప్పొచ్చు.
మెగాస్టార్ చిరంజీవితో తనది రక్త సంబంధం అని నటి హేమ గర్వంగా చెబుతున్నారు. అంతేకాదు చిరంజీవిని దేవుడితో పోల్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతకీ మెగాస్టార్‌తో హేమకు రక్త సంబంధం ఎలాంటిదో తెలుసుకుందామా? అయితే ఆలస్యం ఎందుకు? ఈ చిన్న కథనాన్ని చదివితే అర్థమవుతుంది.
కరోనా విపత్తులో రక్తదానం చేసే వాళ్లు తక్కువయ్యారని, కావున రక్తం ఇచ్చేందుకు ముందుకొచ్చి ప్రాణాలు కాపాడాలని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఆయన పిలుపునందుకున్న హేమ తన కూతురితో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె చిరంజీవిని, ఆయనతో రక్త సంబంధాన్ని నెమరు వేసుకున్నారు.
16 ఏళ్ల క్రితం కాన్పు సమయంలో తనకు తీవ్ర రక్తస్రావం అయిందని, అప్పట్లో తనకు రక్తం అవసరమైందని హేమ తెలిపారు. అయితే తనది అరుదైన బ్లడ్ గ్రూప్ అని, ఎక్కడా దొరక్కపోవడంతో రాజారవీంద్రకు ఫోన్ చేసినట్టు తెలిపారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి తనకు కావాల్సిన రక్తాన్ని నటుడు రాజారవీంద్ర తీసుకొచ్చారని నాటి తీపి గుర్తులను ఆమె గుర్తు చేశారు. అప్పుడే తనకు రక్తం విలువ తెలిసిందన్నారు. అప్పట్లో తనను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆదుకోకపోతే ప్రాణం మీదకు వచ్చేదన్నారు.
అందుకే చిరంజీవిని తాను దేవుడిలా భావిస్తానన్నారు. రక్తం ఇచ్చిన తనను ఆదుకున్న చిరంజీవి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు. అందుకే నేడు ఆయన పిలుపు మేరకు తన కూతురితో కలిసి రక్తం ఇచ్చేందుకు వచ్చినట్టు హేమ వెల్లడించారు. ఆదండీ మెగాస్టార్‌తో నటి హేమకున్న రక్త సంబంధం.