‘కరోనా వైరస్ రాదు.. రానివ్వం.. వచ్చినా, పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది..’ అంటూ అసెంబ్లీ సాక్షిగా సెలవిచ్చారు కొన్నాళ్ళ క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కరోనా సోకినవారికి పారాసిటమాల్ ట్యాబ్లెట్ వాడటం అనేది తప్పనిసరి. జ్వరం తగ్గడంలో ఇది ఉపకరిస్తుంది. కానీ, పారాసిటమాల్ ఒక్కటే మందు.. అనడం దగ్గరే అసలు సమస్య వచ్చిపడింది.
ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ విషయమై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. కరోనా వైరస్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచాన్ని స్తంభింపజేసింది.. వేలాది, లక్షలాది ప్రాణాల్ని తీసేసింది దేశవ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా అధికారిక మరణాలెన్ని.? అసలు మరణాలెన్ని.? అన్నదానిపై భిన్న వాదనలు వున్నాయి.
కరోనా వైరస్.. ఓ మహమ్మారి. దీని గురించి పాలకులు తేలిగ్గా మాట్లాడితే, ప్రజల పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. ఆందోళనను తగ్గించేందుకు ధైర్యం చెప్పేలా.. ‘అది పెద్ద సమస్య కాదు’ అనడం వరకూ ఓకే. కానీ, ‘మూడో వేవ్ ఇప్పట్లో రాదు..’ అని ప్రకటనలు చేసేస్తేనే కష్టం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ లోపల కరోనా మూడో వేవ్ రాదని తేల్చేశారు. నిజానికి, మూడో వేవ్ ఇప్పటికే మొదలైందంటూ.. ఆ మధ్య మహారాష్ట్రలో పిల్లల్లో కరోనా కేసులు వెలుగు చూశాక అంతా భావించారు. కానీ, పరిస్థితి ప్రస్తుతం అందుపులోనే వుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. అలాగని జాగ్రత్తగా లేకపోతే పెను విపత్తు తప్పదు. ‘మేం సిద్ధంగా వున్నాం..’ అని ప్రభుత్వాలు చెప్పడం మామూలే. అదే నిజమనే భ్రమల్లో ప్రభుత్వాలు వుంటే నిండా మునిగిపోవాల్సిందే.
పారాసిటమాల్ వేసుకుంటేనే కరోనా వైరస్ తగ్గిపోతే.. ప్రైవేటు ఆసుపత్రులు లక్షల్లో ఫీజులెందుకు గుంజుతున్నాయ్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలెందుకు ఆక్సిజన్, రెమిడిసివిర్ వంటి మందుల కోసం నానా అగచాట్లూ పడుతున్నాయ్.?