‘పోతిరెడ్డిపాడు విషయంలో గత ముఖ్యమంత్రులతో కొట్లాడింది నేనే. ఇప్పుడైనా, ఎప్పుడైనా.. పోతిరెడ్డిపాడు విషయంలో మా ఆలోచనలు మారవుగాక మారవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొందరపాటుతనంతో జీవో ఇచ్చింది. మేం, ఘాటుగా స్పందించాం. ఎట్టిపరిస్థితుల్లోనూ కృష్ణా నది నుంచి నీళ్ళను అడ్డగోలుగా ఎత్తుకెళ్తామంటే ఆంధ్రప్రదేశ్‌ని అనుమతించం..’ అని కేసీఆర్ తేల్చి చెప్పారు.
‘రాయలసీమకు నీళ్ళు అందాల్సిందే. కానీ, అది కృష్ణా నదితో అదనంగా సాధ్యం కాదు. గోదావరి నదిలో మాత్రమే అదనపు వరద వస్తుంటుంది. దాని మీదనే తెలంగాణ కూడా ఆధారపడాలి. ఆంధ్రప్రదేశ్‌కి కూడా అదే ఉపయోగపడ్తుంది. ఈ విషయాన్నే, ఇంటికి పిలిచి.. భోజనం పెట్టి మరీ చెప్పాం.. అదే మాటకు కట్టుబడి వుంటాం. మంచిగా చెబుతాం. వింటే సరే సరి, లేదంటే.. ఎలా స్పందించాలో మాకు తెలుసు..’ అని కేసీఆర్ పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి, అదనంగా ఎత్తిపోతల పథకం నిర్మించి, రాయలసీమకు కృష్ణా నది నుంచి నీళ్ళు తరలించే దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వడంతో ‘రగడ’ మొదలైన విషయం విదితమే. అయితే, తమ వాటాని తాము తీసుకెళ్ళేందుకు కొత్త ఎత్తి పోతల పథకం నిర్మించుకుంటే తెలంగాణకు అభ్యంతరమేంటి.? అంటూ ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ తన వాదనను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ వద్ద గట్టిగానే విన్పించింది. దానికి ధీటుగా తెలంగాణ కూడా తన వాదనను విన్పించిన విషయం విదితమే.
మొదటి నుంచీ కృష్ణా నది నీళ్ళ విషయంలో కేసీఆర్ ఖచ్చితమైన అభిప్రాయంతో వున్నారు. ఆ మాటకొస్తే, వైఎస్ జగన్‌తో కేసీఆర్ చేతులు కలిపింది కేవలం గోదావరి జలాల విషయంలోనే. అయితే, ఆ స్నేహం కారణంగా పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ లైట్ తీసుకుంటారని భావించిన వైఎస్ జగన్‌కి చుక్కెదురయ్యే అవకాశాలు లేకపోలేదు. మరోపక్క కేసీఆర్ – వైఎస్ జగన్ మధ్య ‘పొలిటికల్ డ్రామా’ నడుస్తోందనీ, ఇదంతా ప్రత్యర్థుల దృష్టి మళ్ళించడానికేననీ ప్రచారం జరుగుతోందనుకోండి.. అది వేరే సంగతి.