మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఫిబ్రవరిలో విడుదలై ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకు మిశ్రమ స్పందన అందుకుంది. విడుదలైన కొన్నిరోజులకే కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ లాక్ డౌన్ కారణంగా ఎక్కువ మందికి చేరువ కాలేదు. తరువాత నిర్మాతలు చిత్రాన్ని ఒటీటీ ప్లాట్ ఫాంలో విడుదల చేసారు.
కాగా, తాజాగా ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో విడుదల చేసారు. లాక్ డౌన్ తర్వాత దుబాయిలో థియేటర్లు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మే 27నుంచి ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రాన్ని అక్కడి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈవిషయాన్ని దుల్కర్ తన ఇన్స్టాగ్రామ్ లో తెలియచేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ‘చాలా రోజుల తర్వాత థియేటర్లలో సినిమా సందడి చేయడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు. దొంగతనాల నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో రీతూవర్మ నాయికగా నటించగా తమిళ దర్శకుడు గౌతమ్ మేనన్ కీలకపాత్రలో కనిపించారు.
థియేటర్ల పునఃప్రారంభం విషయంలో దుబాయి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలేమిటో తెలుసుకుని మన ప్రభుత్వాలు కూడా థియేటర్లు తెరిచే విధంగా ముందుకు అడుగులు వేస్తే పరిశ్రమపై ఆధారపడి బ్రతుకుతున్న ఎందరో కార్మికులకు జీవనోపాధి కల్పించినవారవుతారు. త్వరలోనే మన థియేటర్లు కూడా తెరచుకుంటాయని ఆశిద్దాం.