కరోనా వైరస్ ముప్పు రోజురోజుకీ పెరుగుతోంది. ఈ తరుణంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ‘ఏడాది పాలన’ సంబరాలకు సమాయత్తమవుతోంది. ఈ నెల 23 నుంచి వారం రోజులపాటు సంబరాల కోసం అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఏర్పాట్లు షురూ అయ్యాయి.
తన రాజకీయ జీవితంలో తొలిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సంబరాలు చేసుకోవాలనుకుంటే.. అది తప్పుపట్టాల్సిన విషయమే కాదు. కానీ, ఇక్కడ సందర్భం వేరు.. రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న పరిస్థితులు వేరు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో వుంది. జనం ఎక్కువమంది గుమికూడవద్దని ప్రభుత్వమే చెబుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిపై కేసులూ నమోదవుతున్నాయి.
అయితే, అధికార వైసీపీ నేతలకు మాత్రం మినహాయింపులు వున్నట్లే కన్పిస్తోంది. నిజానికి, వైసీపీ నేతల అత్యుత్సాహం వల్లనే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందనే విపక్షాల విమర్శలూ లేకపోలేదనుకోండి.. అది వేరే సంగతి. చిత్తూరు జిల్లాలోనూ, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనూ వైసీపీ నేతలు చేసిన ఓవరాక్షన్, కరోనా వైరస్ వ్యాప్తికి కారణమంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి గత కొద్ది రోజులుగా.
మరోపక్క, అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులు చేసిన పబ్లిసిటీ స్టంట్లపై కోర్టులో పిటిషన్ దాఖలవడం, న్యాయస్థానం ఘాటుగా స్పందించడమూ జరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ సంబరాలు ఎంతవరకు సబబు.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మరోపక్క, ‘ఏ మొహం పెట్టుకుని సంబరాలు చేసుకుంటారు.? ప్రజా వేదిక కూల్చారు.. పోలవరం ప్రాజెక్టుని అటకెక్కించారు.. కరెంటు ఛార్జీలతో ప్రజల నడ్డి విరుస్తున్నారు.. సంక్షేమ పథకాల మాటున పబ్లిసిటీ రాజకీయాలు తప్ప, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేశారని.?’ అంటూ విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.