దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా, రోజువారీ కేసుల సంఖ్య 29 వేల మార్క్ దాటింది.. 30 వేలకు కాస్త దగ్గర్లో వుందంతే. దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న కరోనా వైరస్‌కి సంబంధించి వాస్తవ పరిస్థితి ఇలా వుంటే, కేంద్రం వాదన ఇంకోలా వుంది. ‘టెస్టుల సంఖ్య పెరుగుతోంది.. కేసుల పెరుగుదల నిలకడగా వుంది.. ఆ మాటకొస్తే, మరీ అంత ప్రమాదకరమైన పరిస్థితి లేదు..’ అని కేంద్రం చెబుతోంది.
గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా వున్నాయి. గ్రామ స్థాయిలోకి కరోనా వైరస్ చొచ్చుకుపోయింది. ఎప్పుడు ఎవరు కరోనా కాటుకి బలవుతారో తెలియని పరిస్థితి. ఇంకోపక్క కరోనా వైరస్‌కి ఖచ్చితమైన వైద్యం ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. కరోనా వైరస్ చికిత్సలో భాగంగా వాడుతోన్న కొన్ని మందులు, వాస్తవ ధరకు పది రెట్లు ఎక్కువగా బ్లాక్ మార్కెట్ అయిపోతుండడం మరింత బాధాకరమైన విషయం.
ఇదిలా వుంటే, కరోనా టెస్టుల సంఖ్య దేశంలో నిన్న ఒక్కరోజే 3 లక్షలు దాటడం గమనార్హం. 3 లక్షల టెస్టులు.. అనే సంఖ్య పెద్దదిగానే కన్పిస్తున్నా, 130 కోట్ల మంది జనాభా వున్న దేశంలో 3 లక్షల టెస్టులు పెద్ద విషయమే కాదు. పైగా, ఇందులో ‘ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగెటివ్’ ఎక్కువ వస్తున్నట్లు ఆరోపణలూ లేకపోలేదు. ముంబైలోని ధారావి అంటే.. మురికి కూపం. అక్కడ కరోనా వైరస్ అదుపులోకి రావడం పట్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కానీ, దేశంలో చాలా నగరాల్లో.. అదీ ‘రిచ్’ ఏరియాస్‌లో కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
ఇవన్నీ ఓ ఎత్తు, కార్పొరేట్ వైద్యం సామాన్యుడ్ని దోచేస్తోంది.. కాదు కాదు, ప్రాణాల్ని హరించేస్తోంది. ప్రస్తుతం దేశంలో అప్రకటిత మెడికల్ ఎమర్జన్సీ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లోనూ కార్పొరేట్ ఆసుపత్రులు దోచేస్తోంటే.. ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు.? ఎప్పుడైతే ‘లాక్ డౌన్’ వెసులుబాట్లలో భాగంగా మద్యం దుకాణాలు తెరవడానికి కేంద్రం అనుమతిచ్చిందో.. అప్పటినుంచే పరిస్థితి అదుపు తప్పింది. కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు. ఈలోగా కేసులు లెక్కకు మిక్కిలిగా పెరిగిపోతున్నాయి. వ్యాక్సిన్ వచ్చేలోగా ఎన్ని ప్రాణాలు పోతాయి.? అన్నది అంచనా వేయడమే కష్టంగా మారుతోంది. ప్రభుత్వాలు మాత్రం, ‘మరణాల శాతం తగ్గుతోంది..’ అంటూ ‘కాకి లెక్కలు’ చూపించి, ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.