కరోనా కేసుల పెరుగుదలలో తెలుగు రాష్ట్రాలు నిన్నటి వరకు ఇంచుమించు ఒకే తీరుగా సాగాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కేసులు తక్కువగానే నమోదువుతున్నాయి. శనివారం ఒక్కరోజులో 7 కేసులే నమోదయ్యాయి. కానీ ఏపీలో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం ఏకంగా 61 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కేసుల సంఖ్యను చూస్తుంటే తెలంగాణలో తగ్గుతున్నాయని, ఏపీలో మాత్రం పెరుగుతున్నాయని కనిపిస్తోంది.
కానీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. మీడియా సైతం కేసుల సంఖ్యనే ప్రధానంగా చూపిస్తోంది తప్ప.. పెరుగుదల రేటును కప్పిపుచ్చుతోంది. ఫలితంగా ఏపీలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో పరీక్షల సంఖ్య భారీగా పెరిగింది. అందువల్లే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఒక విధంగా అది మంచిది కూడా. పాజిటివ్ కేసులు ఎంత త్వరగా బయటపడితే దానిని నివారించడానికి అంతగా వీలవుతుంది.
కరోనా వైరస్ ను నివారించడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం కాదు.. పరీక్షల సంఖ్య కూడా పెంచాల్సిందేనని పలువురు వైద్య నిపుణులు కూడా స్పష్టంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కారు పరీక్షల వేగం పెంచింది. రోజుకు దాదాపు ఆరేడు వేల నమూనాలను పరీక్షిస్తోంది. శనివారం 6,928 మందికి పరీక్షలు జరపగా.. 61 మందికి పాజిటివ్ అని తేలింది. సగటున ప్రతి పది లక్షల మంది జనాభాకు 1147 పరీక్షలు నిర్వహిస్తోంది. ఇది దేశంలోనే అత్యధికం. ఇప్పటివరకు 61,266 మందికి పరీక్షలు చేయగా.. 1016 మందికి పాజిటివ్ వచ్చింది. 31 మంది చనిపోయారు.
ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి పరీక్షలు తక్కువగా ఉంటున్నాయి. ప్రతి పది లక్షల జనాభాకు ఇక్కడ పరీక్షలు జరుగుతోంది 418 మందికి మాత్రమే. పైగా రోజుకు ఏడెనిమిది వందలకు మించి పరీక్షలు చేయలేకపోతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో 18,514 మందికి మాత్రమే పరీక్షలు జరిపారు. నిజంగానే ఇక్కడ వైరస్ అదుపులోకి వచ్చి పాజిటివ్ కేసుల సంఖ్య లేకపోతే అంతకుమించిన సంతోషం ఉండదు. అదే సమయంలో పరీక్షలను పెంచే విషయంపై కూడా దృష్టి పెడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైరస్ తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుండటం, వైరస్ కణాలను పొదిగే కాలం 14 రోజుల నుంచి 28 రోజులకు పెరగడం, లక్షణాలు లేకున్నా కొంతమందికి పాజిటివ్ నిర్ధారణ కావడం వంటి అంశాలు పరీక్షలను పెంచాల్సిన అవసరాన్ని స్పష్టంచేస్తున్నాయి.
వాస్తవానికి లాక్ డౌన్ విషయంలో తెలంగాణ సర్కారు అద్భుతంగా వ్యవహరిస్తోంది. కేంద్రం ప్రకటించిన గడువు కంటే నాలుగు రోజులు ఎక్కువగానే ఇక్కడ లాక్ డౌన్ విధించింది. పైగా కేంద్రం ఇచ్చిన వెసులుబాట్లను కూడా ఇక్కడ ఇవ్వలేదు. అంత కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలుకు సర్కారు కృషి చేస్తోంది. ఇది కూడా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఒక కారణంగానే చెప్పొచ్చు. తెలంగాణలో కూడా పరీక్షలు వేగం పెంచితే త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.