కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన రోల్స్ రాయీస్ కారుకు సంబంధించి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించలేదనే విషయం ఎంత హాట్ టాపిక్ గా మారిందో తెలిసిందే. విజయ్ పై మద్రాసు హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఆయన చర్య రాజద్రోహమేనని కూడా వ్యాఖ్యానించింది. అంతేకాదు.. విజయ్ ను మందలిస్తూ లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ విషయం కోలీవుడ్ వర్గాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అయితే.. తాజాగా మరో హీరో ధనుష్ కూడా ఇదేవిధంగా పన్నుమినహాయింపు కోరుతూ కోర్టును ఆశ్రయించడం మరింత హాట్ టాపిక్ అయ్యింది. ఒక హీరోను ఇప్పటికే కోర్టు నిందించగా.. మరో హీరో ఇదే విషయమై కోర్టు మెట్లెక్కడం గమనార్హం!
ధనుష్ కూడా రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సామాన్యుడు సబ్బు కొనుగోలు చేసినా ప్రభుత్వానికి పన్ను కడుతున్నాడు. మరి కోట్లు సంపాదించే సినీ నటుడు ఎందుకు ట్యాక్స్ పే చేయడు? అని ప్రశ్నించింది. అంతేకాకుండా.. ఎంతటి ఖరీదైన కారు కొనుగోలు చేసినా.. రోడ్డుమీదనే నడపుతారని ఆకాశంలో కాదు అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. లాయర్లపైనా ఆగ్రహం వ్యక్తంచేశారు జడ్జి. ఇటువంటి పిటిషన్ వేయాలని క్లయింట్ అడిగినప్పుడు.. ట్యాక్స్ ఎందుకు చెల్లించాల్సిన అవసరం ఉందో వివరించాల్సిన బాధ్యత న్యాయవాదులకు లేదా? అని ప్రశ్నించారు.
హీరో విజయ్ కేసులోనూ జడ్జి ఇదేవిధమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2012లో లండన్ నుంచి కారు కొనుగోలు చేసిన విజయ్.. దానికి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించడానికి నిరాకరించడంతో.. విషయం కోర్టు వరకు వెళ్లింది. దీంతో.. న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విజయ్ తీరు రాజద్రోహమేనని వ్యాఖ్యానించింది. సినిమా నటులు రీల్ హీరోలుగా కాకుండా.. రియల్ హీరోలుగా ఉండాలని హితవు పలికింది. అయితే.. ఈ విషయంలో అందరూ ఒకవైపే తెలుసుకున్నారని అసలు విషయం వేరే ఉందని విజయ్ లాయర్ కుమారసన్ ఆ మధ్యనే వివరణ ఇచ్చారు.
తమ వాదన ఏంటీ? జరుగుతున్న ప్రచారం ఏంటీ అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. అసలు.. తాము దాఖలు చేసిన కేసు ఏంటన్నది కూడా చెప్పారు. దీనికన్నా ముందు.. ఇలాంటి ఓ కేసును కూడా వివరించారు. 199లో విలియమ్ ఫెర్నాడెజ్ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో ఎంట్రీ ట్యాక్స్ విషయమై కేసు పెట్టారట. ఈ పిటిషన్లో విలియమ్ వాదన ఏమంటే.. ”మేము వాహనాన్ని దిగుమతి చేసుకున్నప్పుడు భారీగా దిగుమతి సుంకం చెల్లించాం. మళ్లీ ఎంట్రీ ట్యాక్స్ ఏంటీ? ఇది న్యాయం కాదు” అని కేరళ హైకోర్టులో వాదించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. కస్టమ్స్ ట్యాక్స్ చెల్లించిన తర్వాత ఎంట్రీ ట్యాక్స్ వర్తించదని తీర్పు చెప్పిందట.
విజయ్ కేసు కూడా అలాంటిదేనని ఆయన దిగుమతి సుంకం మొత్తం చెల్లించారని చెప్పారు. అయినాకానీ.. ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాలని కోరడంపైనే వివాదం నెలకొందని తెలిపారు. దీంతో.. 2012లో ఆ కారు కొనుగోలు చేసిన సమయంలోనే షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులను కోర్టు జారీచేసిందని దీని ప్రకారం.. 20శాతం ఎంట్రీ ట్యాక్స్ చెల్లించి వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చని కోర్టు తెలిపిందన్నారు. దీంతో.. విజయ్ ఆ మొత్తాన్ని చెల్లించిన తర్వాతనే రిజిస్టర్ చేసుకొని కారును వినియోగించారని కూడా తెలిపారు. ఈ విషయం పూర్తిగా తెలియని వారు విజయ్ పై విమర్శలు చేస్తున్నారని ఇది సరికాదని అన్నారు. కాగా.. కోర్టు ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ ముందు కూడా సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ధనుష్ ఇష్యూతో మరోసారి.. ఈ కార్ల ట్యాక్స్ అంశం తెరపైకి వచ్చింది. మరి ధనుష్ ఈ తీర్పుపై ఎలా స్పందిస్తారో చూడాలి.