అగ్ర నిర్మాత దిల్ రాజు సస్పెన్సుకు తెరదించారు. చాన్నాళ్లుగా తన రెండో పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. తన భార్య అనిత మరణించిన నేపథ్యంలో మూడేళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఆయన ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లాలోని తన స్వగ్రామంలో పెళ్లి చేుకున్నారు. తనే స్వయంగా కట్టించిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఆయన పెళ్లి చేసుకున్నారు.
వధువు పేరు తేజస్విని అని వెల్లడైంది. ఐతే ఆమ పేరును వ్యాఘ రెడ్డిగా మార్చినట్లు చెబుతున్నారు. ఆస్ట్రాలజీ ప్రకారమే పేరు మార్చారంటున్నారు. వధువు ఒకప్పుడు ఎయిర్ హోస్టెస్‌గా పని చేసిందని.. ఆమె బ్రాహ్మణ అమ్మాయి అని కూడా అంటున్నారు. అంటే దిల్ రాజు చేసుకున్నది కులాంతర వివాహం అన్నమాట.
ఇదిలా ఉంటే దిల్ రాజుకు మళ్లీ పెళ్లి చేయించింది ఆయన తనయురాలే అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 2017లో భార్య అనిత (46) హఠాత్తుగా మరణించడంతో దిల్ రాజు కుంగిపోయారు. ఆయన అమెరికాలో ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. భార్య మరణానంతరం రాజు ఒంటరిగానే ఉంటున్నారు.
రాజు పెద్ద నిర్మాత అయినా.. ఎప్పుడూ చుట్టూ ఎంతమంది ఉన్నా.. ఇంట్లో ఆయన్ని చూసుకునే దగ్గరి మనిషి లేకపోవడంపై కుమార్తె బాధపడి.. ఆయనకు రెండో పెళ్లి చేయాలని సంకల్పించిందని.. వధువును చూసింది ఆమే అని ఒక కథనం వినిపిస్తోంది.
గత రెండేళ్లలో రాజు రెండో పెళ్లి గురించి కొన్ని షాకింగ్ రూమర్లు వినిపించాయి. ఆదివారం నాటితో వాటన్నింటికీ తెరపడిపోయింది.