అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధుల సభలో అభిశంసన ఎదుర్కొన్నారు. ప్రతినిధుల సభలో రెండోసారి అభిశంసన ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. సభలో 232-197 ఓట్ల తేడాతో అభిశంసన తీర్మానం నెగ్గింది. అభిశంసన తీర్మానానికి సొంత పార్టీకి చెందిన పది మంది సభ్యులు మద్దతు తెలపడం విశేషం. ఓటింగ్‍లో నలుగురు కాంగ్రెస్ సభ్యులు పాల్గొనలేదు. అయితే.. నలుగురు ఇండో-అమెరికన్ సభ్యులు అభిశంసనకు మద్దతు తెలుపుతూ ఓటేశారు.
ఈ నేపథ్యంలో అభిశంసనపై విచారణ జరిపి ఓటింగ్ నిర్వహించేందుకు సెనెట్ సిద్ధమైంది. సెనెట్‍లో ఆమోదం పొందితే ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19కి సెనెట్ వాయిదా పడింది. సెనెట్‍లో ఆమోదం పొందడానికి డెమొక్రాట్లకు 17 ఓట్లు అవసరం కానున్నాయి. ఈ నెల 6న క్యాపిటల్ హిల్ భవనంపై దాడిని ప్రోత్సహించారంటూ డెమొక్రాట్లు అభిశంసన తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. దాడికి ట్రంప్ మద్దతుదారులు ప్రయత్నించిన విషయం కూడా విదితమే.