డోనాల్డ్ ట్రంప్.. వివాదాలకు, విపరీత చేష్టలకు పెట్టింది పేరు. అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ కు వచ్చినంత చెడ్డపేరు ఎవరికీ రాలేదు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాకుండా శ్వేతసౌథం వీడి వెళ్లిపోయిన ఇప్పుడేం చేస్తున్నారు? ఎలా గడుపుతున్నారు? రాజకీయాల్లో కొనసాగుతారా లేక బిజినెస్ మ్యాన్ గా బిజీ అవుతారా అనే చర్చ సాగుతోంది. గతంలో ఆయన ఎప్పటికప్పుడు తన ఆలోచనలను ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా పంచుకునేవారు. కానీ జనవరిలో క్యాపిటల్ హౌస్ లో జరిగిన ఘర్షణల అనంతరం ఈ రెండు సోషల్ మీడియా సంస్థలు ట్రంప్ ఖాతాలపై నిషేధం విధించాయి. దీంతో ఆయన తానేం చేస్తున్నది చెప్పడం కుదరడంలేదు.
అయితే, ఆయన అభిమానులు మాత్రం ఎప్పటికప్పుడు ట్రంప్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. శ్వేతసౌథం నుంచి ఫ్లోరిడాలోని తన నివాసానికి వెళ్లిపోయిన తర్వాత కొన్నాళ్లపాటు గోల్ఫ్ క్లబ్ లో గడిపారు. అక్కడ కులాసాగా ఉంటూ.. ప్రతి చిన్న కార్యక్రమానికీ హాజరవుతూ సేద తీరారు. ఇక త్వరలోనే మళ్లీ రాజకీయాలపై ఆయన దృష్టి సారించబోతున్నారని చెబుతున్నారు. రిపబ్లికన్ పార్టీపై తన పట్టు కోల్పోకుండా గట్టి చర్యలు తీసుకున్న ట్రంప్.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి త్వరలోనే ర్యాలీలు నిర్వహించనున్నారని అంటున్నారు. మరోవైపు పార్టీలో చాలామంది నేతలు ట్రంప్ చూపు తమపై ఉంటే చాలనే ధోరణిలోనే ఉన్నారు. ఇప్పటికే తనను విమర్శిస్తున్న లీజ్ చెనీను పార్టీ నాయకత్వం నుంచి ట్రంప్ తప్పించారు. అలా పార్టీపై తన పట్టు కొనసాగిస్తున్నారు.