టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్ అన్నారు. ఢిల్లీలో బీజేపీలో చేరిన అనంతరం.. మేడ్చల్ జిల్లాలోని శామిర్ పేటలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీలో చేరటం గర్వంగా ఉంది. 2024లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరడం ఖాయం. ప్రస్తుత హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రజలు తమ సొంత ఎన్నికగా.. తామే స్వయంగా ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టుగా భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో హుజూరాబాద్ నియోజకవర్గం చూపిన స్పూర్తి మళ్లీ చూపించబోతోంది.
‘చట్టం కొంతమందికే పని చేస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగితే తెలంగాణ ప్రజలకు అరిష్టం. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు నిద్రపోకూడదని తెలంగాణ సమాజం అనుకుంటోంది. పాలకులకు గుణపాఠం చెప్పాలి. అహంకారానికి ఘోరీ కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కోరి సాధించుకున్న రాష్ట్రంలో ఇన్ని బాధలు పడతామని తెలంగాణ సమాజం ఊహించి ఉండదు. గడ్డిపోస కూడా ఇప్పుడు అవసరమే. ప్రజల ఆశీర్వాదం లేకపోతే రాజకీయ నాయకునికి బతుకు ఉండదు. నాపై చూపుతున్న ఆదరణకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. నా డీఎన్‌ఏను పక్కన పెడితే.. మరో ఆత్మగౌరవ పోరాటానికి ప్రజలంతా సిద్ధం కావాలి’.
చరిత్ర మెదలవ్వాలంటే ఏదొక పార్టీ తోడుండాలి కాబట్టే టీఆర్ఎస్‌లో పని చేశాను. నా ఇల్లు మేడ్చల్‌లోనే ఉంది. వాళ్ల కళ్ళలో మెదిలే బిడ్డను నేను. నిత్యం మీకు అందుబాటులో ఉంటాను. నేను నిప్పులాగా పెరిగిన బిడ్డను. నా భూమి గుంజుకున్నా లోంగిపోలేదు. ఆనాడు ఉద్యమంలో మేము లేకపోతే కెప్టెన్ ఎక్కడుండేవాడు. కెప్టెన్ ఆదేశాలను మేము సమర్థవంతంగా అమలు చేశాం కాబట్టే ఆయనకు పేరు, గుర్తింపు వచ్చాయి. ఉద్యమంలో ప్రజల కాళ్ళ మధ్యలో తిరిగాను. సుష్మా స్వరాజ్, విద్యాసాగరరావు వంటి నేతలతో ఉద్యమంలో పాల్గొన్నా’ అని అన్నారు. సమావేశంలో మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.