తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్, తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారనీ, పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తారని అంతా అనుకున్నారు. తన మీద కబ్జా ఆరోపణలు రావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఈటెల రాజేందర్, ఆ దిశగా సన్నిహితులతో మంతనాలు జరిపారు కూడా. ఆరోపణలు రావడం, ఆ వెంటనే విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించడం, ఇంకోపక్క టీఆర్ఎస్ అనుకూల మీడియా ద్వారా ఈటెలపై దుష్ప్రచారం షురూ అవడం.. ఇన్ని పరిణామాల మధ్య ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈటెల కొనసాగడం దాదాపు అసాధ్యమేనన్న భావన ఈటెల అభిమానుల్లోనూ వ్యక్తమయ్యింది.
కానీ, ఈటెల రాజేందర్, నిన్న రాత్రి మీడియా ముందుకొచ్చి, తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు తప్ప, రాజీనామా చేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈటెల, ‘నేనింకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే వున్నాను.. మంత్రి పదవిలోనే వున్నాను. నన్ను బయటకు పంపాలనుకుంటే పంపొచ్చు. కానీ, ఇది పద్ధతి కాదు. ముఖ్యమంత్రి నాతో మాట్లాడి వుండాలి. పోనీ, మంత్రులు, ఇతర ముఖ్య నేతలైనా నాతో మాట్లాడి వుండాల్సింది..’ అన్నారే తప్ప, రాజీనామా అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.
‘వేరే పార్టీలోకి వెళతారా.? కొత్త పార్టీ పెడతారా.?’ అని అడిగినా, ఈటెల నర్మగర్భమైన వ్యాఖ్యలు మాత్రమే చేశారు. ‘ఇప్పటికైతే ఎలాంటి ఆలోచనా చేయలేదు.. పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి వుంది..’ అని మాత్రమే సెలవిచ్చారు. ‘బెదిరింపులకు లొంగను, ప్రేమకు లొంగుతాను..’ అంటూ ఈటెల డైలాగులు చెప్పారు.
నిజానికి, ఈటెల రాజేందర్, భూ కబ్జాలకు పాల్పడ్డారంటే తెలంగాణలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. కానీ, ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. విచారణ కూడా అత్యంత వేగంగా షురూ అయ్యింది. గులాబీ పార్టీలో చాలామంది నేతల మీద ఇంతకంటే దారుణమైన ఆరోపణలు వచ్చినా, ఎవరి మీదా చర్యల్లేవు. కానీ, ఈటెల విషయంలో మాత్రం అత్యుత్సాహం సుస్పష్టం.